Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షుడు విజరు, రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్
నవతెలంగాణ -తిప్పర్తి
నిధులు నియామకాలు అనే ఆకాంటోలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువతను మోసం చేసిందని డీవైఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షుడు ఐత విజరు ,రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ విమర్శించారు. సోమవారం మండలకేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో నిర్వహించిన ఆ సంఘం జిల్లా జనరల్‌బాడీ సమావేశంలో వారు మాట్లాడారు. మొదటి అసెంబ్లీలో రెండేండ్లలో లక్షా7వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఏడేండ్లు గడిచినా భర్తీ చేయలేదన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని హామీనిచ్చి ఇంతవరకు అమలు చేయలేదన్నారు. యువకులు ఐక్యంగా ఉండి తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలన్నారు. డీవైఎఫ్ఐ యువత సమస్యలపై అనేక పోరాటాలు చేసిందన్నారు. నిరుద్యోగ గర్జన పేరుతో ఉద్యమాలు చేసిందన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీపై ఆందోళన చేసిందన్నారు. ఇంటర్ పరీక్షల ఫలితాల్లో తప్పులపై దీక్షలు చేసి ఉద్యమం నడిపిందని తెలిపారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపట్టాలనే కేంద్ర కుట్రను గుర్తించి సేవ్ నల్లమల కాంపెయిన్ చేసి ,సెలెబ్రెటీల మద్దతు కూడగట్టి ,ఆఖరికి ఢిల్లీ దాకా పోయి పోరాడి తవ్వకాలు ఆపేలా పోరాటం నడిపామని తెలిపారు. కరోనా సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నడిపామన్నారు. లక్షా 10వేల కుటుంబాలకు సహకారం వివిధ రూపాల్లో చేశామన్నారు. ఐసోలేషన్ సెంటర్ లలో సేవలు చేశామన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఫీజుల దందాపై పోరాటాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రవినాయక్, మల్లం మహేష్, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు పాతని శ్రీను,శ్రీకర్, భరత్, నరేష్, అక్రం, శ్రీనివాస చారి, బాబునాయక్, శశిధర్, వినోద్ ,నాగేందర్, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.