Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 29, 30 తేదీల్లో కలెక్టరేట్ ఎదుట 48 గంటల మహాధర్నా,
వంటావార్పు
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ-భువనగిరి
జిల్లాలో సాగునీటి ,మౌలిక సమస్యల పరిష్కారం ఈ నెల 29, 30 తేదీల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట 48గంటల మహాధర్నా, వంటావార్పు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ తెలిపారు. మంగళవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి జిల్లా ఏర్పాటై ఐదేండ్లయినా అభివద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. జిల్లాలో కీలకమైన సాగునీటి వనరులు అయినా బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1800 కోట్లు కేటాయింపులు చేసినా ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ,గంధమల్ల రిజర్వాయర్ పై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. నాలుగేండ్లలో గంధమల్ల రిజర్వాయర్ పూర్తి చేసి 9 టీఎంసీల నీటిని సాగుకోసం అందిస్తామని చెప్పిన ప్రాజెక్టు ఉందో లేదో కూడా అంతుచిక్కని సమస్యగా మారిందన్నారు. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎయిమ్స్‌ను మొదలు పెట్టి ఏడాది అయిన ఇప్పటివరకు ఇన్ పేషెంట్ వైద్యసేవలు ప్రారంభించలేదన్నారు. ఉన్నత విద్య అభ్యసించాలని హైదరాబాదకు వెళితే తప్పా అందని పరిస్థితి అన్నారు. పేదలకు చదువుకోవడానికి అవస్థలు పడుతున్నారని తెలిపారు. జిల్లాకేంద్రంలో ప్రభుత్వం డిగ్రీ ,పీజీ కాలేజీలు ఏర్పాటు చేయలేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటి స్థలాలు, 57 ఏండ్లు నిండిన వారందరికి పెన్షన్లు ,దళితులకు 3 ఎకరాల భూమి, రేషన్ కార్డులు వంటి అనేక సమస్యలు సమస్యలతో జిల్లా ప్రజలు సతమతమౌతుంటే ఎమ్మెల్యే ,ఎంపీలు ఏ ఒక్కరు కూడా చిత్తశుద్ధిగా వ్యవహరించడం లేదని విమర్శించారు. సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లడానికి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజులు కలెక్టరేట్ ఎదుట మహాధర్నా 48 గంటల దీక్ష, నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లా ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నర్సింహులు,మాటూరి బాలరాజు గౌడ్, కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ పాల్గొన్నారు.