Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ -భువనగిరి
రైతులు ఆర్థికంగా వచ్చే పంటలను పండించాలని, మార్కెట్లో డిమాండ్ వుండే పంటలు పండించే విధంగా రైతాంగానికి అవగాహన కల్పించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయంగా పంటల సాగు, ధాన్యం కొనుగోలు పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వచ్చే యాసంగిలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం లేదనే విషయం రైతులకు వివరించాలని కోరారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వరి వద్దు ఆదాయం ఇచ్చే ఇతర పంటలు ముద్దు అనే విషయం రైతులకు క్షుణ్ణంగా తెలిసేలా వివరించాలన్నారు. ప్రభుత్వం అన్ని రకాల విత్తనాలను ఏర్పాటు చేసిందనే విషయం రైతులకు తెలపాలన్నారు. కందులు, నువ్వులు, మినుములు, ఆవాలు, పెసర్లు, వేరుశనగ, పామాయిల్ తదితర పంటలపై అవగాహన కల్పించాలన్నారు. కేంద్రం వానాకాలంలో ధాన్యం కొనుగోలు చేయలేమని, ధాన్యం నిలువలు ఎక్కువయ్యాయని చెప్పినందునముఖ్యమంత్రి స్వయంగా ప్రధానమంత్రి,హోం శాఖ, వ్యవసాయ శాఖ మంత్రులను కలిసి రైతుల ఇబ్బందులను వారి దష్టికి తెచ్చారన్నారు. యాసంగిలో ఒక గింజ కూడా కొనలేమనే కండిషన్ పై ఇప్పుడు వానకాలం ధాన్యాన్ని కొంటామని కేంద్రం తెలిపిందన్నారు. యాసంగి ధాన్యాన్ని కూడా కలిపి ఇప్పుడే కేంద్రం కొంటున్నదని, ఈ విషయం రైతులకు వివరంగా తెలియ చేయాలని అధికారులకు సూచించారు. రైతులు తమ సమస్యలను కూర్చుని మాట్లాడుకునేందుకు, వారికి తగిన సలహాలు ఇచ్చేందుకు వేదికగా నిర్మించిన రైతు వేదికలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవని, ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, రైతులను కాపాడుకొనేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నదని, ముఖ్యమంత్రి ఏడేండ్లుగా తీసుకున్న చర్యల వల్లనే రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందన్నారు. జిల్లాలో ఇప్పుడు 2లక్షలా 79 వేలా 808 ఎకరాల్లో వరి సాగైందన్నారు. దాదాపు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాబోతుందన్నారు. గతంలో ఏర్పాటు చేసిన విధంగానే 187 సెంటర్ల ద్వారా కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు గొంగిడి సునీత రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస రెడ్డి, భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివద్ధి అధికారి ఉపేందర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి, మార్కెటింగ్, సివిల్ సప్లై అధికారులు, డీలర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.