Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
- వాసాలమర్రిలో దళితబంధు లబ్దిదారులకు వాహనాలు పంపిణీ
నవతెలంగాణ -తుర్కపల్లి
తెలంగాణ సాధించిన విధంగానే దళితబంధు పథకం కూడా ప్రపంచానికి ఒక రోల్‌మోడల్ కాబోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని సీఎం దత్తతగ్రామమైన వాసాలమర్రిలో దళిత బంధు పథకం కింద మొదటగా పది మంది లబ్దిదారులకు ఉపాధి పెట్టుబడి కింద వాహనాలను మంత్రి పంపిణీచేశారు. వారందరి జీవితాలలో వెలుగులు నిండాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి లబ్ధిదారులతో స్వయంగా వారు ఎంచుకున్న రంగాల్లో ఏ విధంగా పని నిర్వహిస్తారో, ఎలా చేస్తే లాభాలు వస్తాయో వివరంగా అడిగి తెలుసుకున్నారు. వారికి కావాల్సిన సలహాలు కూడా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో డ్రైవర్లుగా ఉన్న వారు దళిత బంధు పథకం ద్వారా ఓనరులుగా మారారన్నారు. ఉపాధి మెరుగు పరుచుకోవాలని, ప్రభుత్వ ఉద్దేశాలు నెరవేర్చాలని వారిని కోరారు. దళిత బంధు పథకంలో వాసాలమర్రి గ్రామం జిల్లాలో ముందు వరుసలో నిలిపే విధంగా ఉన్నతి సాధించాలన్నారు. తెలంగాణ సాధించిన విధంగానే దళిత బంధు పథకం రేపు ప్రపంచానికి ఆదర్శంగా మారబోతోందని అన్నారు. రాష్ట్రం సిద్ధించాక ఇఫ్తార్ విందు ప్రభుత్వపరంగా నిర్వహించడం అన్ని వర్గాలను ఆదరించడంలో ఒక భాగమన్నారు. మత విశ్వాసాల పట్ల గౌరవమని, బతుకమ్మ, రంజాన్, క్రిస్టమస్ పండుగలకు నూతన వస్త్రాలు ఇవ్వడం ప్రభుత్వం అన్ని మతాలను గౌరవించడలో భాగమని, ముఖ్యమంత్రి నేత్రత్వంలో తెలంగాణ శాంతి సమాజంగా రూపుదిద్దుకుందన్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి మన వాసాలమర్రి గ్రామం నుండి దళిత బంధు ప్రకటించడం అదష్టమన్నారు. లబ్దిదారులకు దేనిలో నైపుణ్యం ఉంటే అందులో ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి భావించారని, ఎలాంటి బ్యాంకు లోన్ లేకుండా డైరెక్టుగా లబ్దిదారుల ఖాతాలోనే జమ చేస్తున్నట్టు తెలిపారు. రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించి వారి ఆర్థిక, సామాజిక ఉన్నతికి వాసాలమర్రి గ్రామంలో ఉపాధి కల్పనలో శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ మాట్లాడుతూ, వాసాలమర్రి గ్రామంలో దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున 76 కుటుంబాలకు రూ.7కోట్లా 60 లక్షలు జమచేసినట్టు తెలిపారు. వారు ఏ ఉపాధి రంగంలో ఆసక్తి ఉన్నారో తెలుసుకునేందుకు పౌల్ట్రీ, కూరగాయలు, పండ్లు, తదితర రంగాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. 76 కుటుంబాలే కాకుండా ఇంకా 10 కుటుంబాలు వలస వెళ్ళినవారు తిరిగి వచ్చారని వారికి కూడా దళిత బంధు వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. లబ్ధిదారులకు 3 మహేంద్ర గూడ్స్ వెహికల్స్, 4 అశోక గూడ్స్ వెహికల్స్, 2 డోజర్స్, ఒక ప్యాసింజర్ ఆటో మంత్రి చేతుల మీదుగా పంపిణీచేశారు. అంతకుముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, శాసనమండలి సభ్యులు ఎలిమినేటి కష్ణారెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ భీకూ నాయక్, ఎస్సీ కార్పొరేషన్ స్పెషలాఫీసర్ ఆనంద్, తుర్కపల్లి ఎంపీపీ శ్రీమతి సుశీల భూక్య రవీంద్ర నాయక్, గ్రామ సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంఎంపీటీసీ నవీన్ కుమార్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.