Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎరువులు, విత్తనాల సంగతి దేవుడెరుడు...
- ప్రత్యామ్నాయ పంటలేలా..
ఎలాంటి భూమిలో ఏ పంటలు సాగు చేయాలనేది రైతు ఇష్టం ... కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నాయి... అలా నిర్ణయిస్తున్న పంటల సాగుకు భూమి అనుకూలంగా ఉందా...లేదా..అవసరం లేకుండా పోయింది. బలవంతగా రైతులపై తాము చెప్పిన పంటలనే సాగు చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఒకవేళ సాగు చేయాలనుకున్న రైతులకు ఆ పంటలకు సరైనా అవగహన లేదు... కల్పించడానికి తీసుకున్న చర్యలు కూడా శూన్యం.. కనీసం సాగు ప్రణాళిక కూడ చేయలేదు. రైతులకున్న అనేక అనుమానాలకు తెరదించకుండానే యాసంగి సీజన్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించడం సరైంది కాదు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 14లక్షల ఎకరాల వరకు సాగు భూమి ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఖరీఫ్‌లో సుమారు 12లక్షల వరకు వరి సాగైనట్టు తెలుస్తుంది. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇందులో నాగార్జున సాగర్ ఆయకట్టు కిందనే 4.5లక్షల నుంచి 5 లక్షల ఎకరాల వరకు వరి సాగవుతుంది. మిగతా ఆరుతడి పంటలు సాగవుతున్నాయి. మిగతా పంటలు పూర్తిగా లక్ష వరకు సాగవుతాయి.
సాగుకు అవకాశం ఇవే....
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఖరీఫ్‌లో వరి, పత్తి, కందులు, పెసర, యాసంగి సీజన్లో వరి, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఉలువలు, బొబ్బర్లు, నువ్వులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. కానీ ప్రస్తుతం ఈ పంటలలో వరి, పత్తి, కందులు వేరుశనగ తప్ప వేరే పంటలు ఎక్కడ సాగు చేయడంలేదు. వాటిని సాగు చేయడమే అన్నదాతలు మర్చిపోయారు. కానీ రైతులు మాత్రం ప్రధానంగా పత్తి, వరి, నామమాత్రంగా వేరుశనగ కందులు పంటల సాగుకే అత్యంత ప్రాదాన్యత ఇస్తున్నారు.
సాగు ప్రణాళికేదీ.....
యాసంగి సీజన్ నవంబర్ మాసం నుంచి మొదలవుతుంది. అయితే అక్టోబర్ చివరి నాటికి పంటల సాగుకు ప్రణాళికను రూపొందిస్తారు. ఎంత విస్తీర్ణంలో సాగు... దానికోసం కావాల్సిన విత్తనాలు, ఎరువులు ప్రతిపాదిస్తారు. అయితే విత్తన సీడ్ కార్పోరేషన్ నుంచి విత్తనాలు సరఫరా చేయడంతో పాటుగా ప్రవేటు డీలర్లు కూడ విత్తనాలను అందుబాటులో పెడతారు. అయితే విత్తనాలకు ఎలాంటి సౌకర్యం లేకపోవడం వల్ల రైతులంతా ప్రయివేటు డీలర్ల నుంచి కొనుగోలు చేస్తున్నారు. విత్తన సీడ్ కార్పొరేషన్ నుంచి చాలా తక్కువ మోతాదులో రైతులు తీసుకుంటున్నారు.
ప్రత్యామ్నాయ పంటల సాగేలా...
నవంబర్ నుంచి యాసంగి సీజన్ ప్రారంభమవుతున్న ఇప్పటివరకు సాగు ప్రణాళిక లేదు.. ప్రణాళికకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు ఎంత అవసరమో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు. ఆ మేరకు వ్యవసాయ శాఖ నుంచి సరఫరా చేస్తారు. కానీ సీజన్ ముంచుకొస్తున్న విత్తనాలు లేవు... ఎరువులు లేవు.. ప్రయివేటు డీలర్ల వద్ద కూడ విత్తనాలు చాలా తక్కువ మోతాదులో ఉన్నట్టు అధికారులే పేర్కొంటున్నారు. సీజన్ ముంచుకొస్తున్న ఏ పంటలు వేసుకోవాలో సరైన స్పష్టత లేకుండా పోయింది. ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదు.. ప్రణాళికలు రూపొందించేప్పుడు... విత్తనాలు అందుబాటులోకి వచ్చెదెప్పుడో.
రైతులకు భరోసా ఏదీ...
పందిరి మీద గుండు పడ్డట్టుగా వరి వేస్తే ఉరి అన్న చందంగా ప్రభుత్వం రైతులను బెదిరించే పద్ధతిలో మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉంది. సుదీర్ఘ కాలంగా కొన్ని పంటలసాగుకే పరిమితైన రైతులకు ఈసారి ఖచ్చితంగా పంటల సాగులో మార్పిడి జరగాలంటే రైతులకు భరోసా కల్పించాల్సి ఉంది. రైతుకు పంటల సాగుపై అవగహన, విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తేవడం..., పంటల కొనుగోలు, మద్దతు ధర తదితర వాటి విషయంలో మద్దతు ధర చెల్లిస్తూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న భరోసా ఇవ్వకుండా మేము చెప్పిన పంటలే వేయాలనడం ఎంతవరకు సబబు.. అంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు.
సాగు ప్రణాళికను నిర్ణయించలేదు
- శ్రీధర్‌రెడ్డి, జేడీఏ నల్లగొండ.
యాసంగి సీజన్‌కు సాగు ప్రణాళికు నిర్ణయించలేదు. ప్రభుత్వం పంటల సాగులో మార్పిడి చేయాలని చెబుతుంది. దానికి అనుగుణమైన ఉత్తర్వులు వచ్చిన తర్వాత తయారు చేస్తాం. సాగుకు సంబంధించి ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది. అందుకే ఆలస్యమైంది.