Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం పోసి 20రోజులు దాటినా ప్రారంభం కానీ కొనుగోలు
- తేమ,మట్టిపెడ్డలు,తాలు లేకుండా చేసి ధాన్యపు రాసులు పోసిన రైతులు
- కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతులకు తప్పని తిప్పలు
ఆరుగాలం కష్టపడి పండించిన పంట రైతు చేతికి వచ్చింది. ధాన్యపు రాసులు చేరిన ఇంట..ధనరాసుల పంట పండాలి. కానీ ప్రభుత్వాల చిన్న చూపునకు రైతులు అరగోసపడుతున్నారు. పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కల్లాలకు చేర్చితే కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
నవతెలంగాణ- చౌటుప్పల్ రూరల్
రైతులు వరిని కోసి అమ్ముకోవడానికి కళ్లాలకు ధాన్యం తెచ్చి ఇరవై రోజులు గడుస్తున్న కూడా ప్రభుత్వాలు నేటికి కొనుగోలు ప్రారంభించలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా రెండులక్షలా 70వేల ఎకరాల్లో వరిసాగు చేశారు. సుమారుగా 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని ఇప్పటికే అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.చౌటుప్పల్,భూదాన్ పోచంపల్లి,వలిగొండ,బీబీనగర్ మండలాల్లో అధికంగా ధాన్యం వచ్చే అవకాశం ఉంది.అయితే ఇప్పటికే సాగు చేసిన పంటలో సగం వరకు వరి కోతలు జరిగాయి. ధాన్యాన్ని కోనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి 20 రోజులు గడుస్తుంది.ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సింగిల్విండో, ఐకెపి, మహిళ సంఘాలు, వ్యవసాయ మార్కెట్లలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రకటించిన కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తరలించారు.అయినా నేటికి ప్రభుత్వం కొనుగోలు ఎప్పటి నుండి ప్రారంభిస్తారో చెప్పక పోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
- తేమ,మట్టిపేడ్డలు,తాలు లేకుండా చేసిన రైతులు
పొలాల నుండి తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోని కల్లాల్లో తేమలేకుండా ఎండపోశారు. మట్టి పేడ్డలు లేకుండా,తాలు లేకుండా తూర్పాల పోశారు. తూకం వేయడానికి సిద్ధం చేసి ఉంచారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు కళ్లాల్లో పడిగాపులు కాస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో పరిశీలిస్తే సింగిల్ విండో నుండి గతంలో 6 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐకేపీ నుండి ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వ్యవసాయ మార్కెట్ నుండి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా సుమారు ఐదు సబ్ సెంటర్లను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేశారు. ప్రస్తుతం సింగిల్ విండో నుండి జైకేసారం-1,జైకేసారం-2,నేలపట్ల, ఎస్.లింగోటం,మందోళ్లగూడెం, తాళ్ళసింగారం,పెద్దకొండూరు, డి.నాగరం,ఎల్లంబావి, మసీదుగూడెంలలో,ఐకేపీ నుండి పంతంగి,అల్లాపురం, చిన్నకొండూర్, కొయ్యలగూడెంలలో,వ్యవసాయ మార్కెట్ నుండి చౌటుప్పల్ మార్కెట్ లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని గుర్తించారు. ఈ కేంద్రాల్లో ఇప్పటికే ధాన్యపు రాసుల నిల్వలు పేరుకుపోయాయి. కొనుగోలు మాత్రం చేయడం లేదు.దీనితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఆందోళన చెందుతున్నారు. ఎండబోసిన ధాన్యం వర్షాలకు తడిసే ప్రమాదం ఉందని భీతిల్లుతున్నారు.
- నిమ్మకునిరెత్తినట్టుగా అధికారుల తీరు..
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరుతుంది.ఇప్పటికి స్పష్టమైన ప్రణాళికలు అధికారులు చేయలేదని ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్న కూడా దానికి అనుకూలంగా ప్రణాళికలు రూపొందించలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఏ కొనుగోలు కేంద్రాలు ఏ మిల్లులకు వెళ్ళాలి..? అనే నిర్ణయం చేయలేదు.కొనుగోలు కేంద్రాలకు తూకం వేయడానికి బస్తాలు సమస్య ఉన్న కూడా తగు చర్యలు తీసుకోలేదని తెలుస్తుంది. మిల్లులకు ట్యాగింగ్ ఇంకా కాలేదు. రైతులు పండించిన పంటకు కొనుగోలు చేయడానికి ఇంత నిర్లక్ష్యం చేయడం ఏమిటని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు అందలేదు..
చింతల దామోదర్ రెడ్డి,సింగిల్ విండో చైర్మెన్ చౌటుప్పల్
కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించాలని ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు అందలేదు. కానీ అధికారులకు ఇప్పటికే విషయాన్ని తెలిపాం. అధికారులు సరైన ప్రణాళికలు సిద్ధం చేయలేదు. లారీల సమస్య, బస్తాల సమస్య ఉన్న కూడా దాని మీద ఇప్పటివరకు శ్రద్ధ చూపడం లేదు. మండలంలో రైతుల వినతులతో గతంలో కన్న అదనంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. కొన్ని గ్రామాల్లో సబ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం.కొనుగోలు ప్రక్రియ ను వెంటనే ప్రారభించాలని ప్రభుత్వ అధికారులను కోరాం.
ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చెయ్యాలి. లేదంటే ఆందోళనలు తప్పవు
చీరిక సంజీవరెడ్డి, తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు
కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇప్పటికే ధాన్యాన్ని పోశారు. తూకం వేసి కొనుగోలు చేయాల్సిన అధికారులు,ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. రైతులను ఇబ్బంది పెట్టేలా ప్రభుత్వ తీరు ఉంది. అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించ కపోతే రైతులను సమీకరించి ఆందోళన చేపడతాం.
- కల్లాల్లో ధాన్యం పోసి ఇబ్బందులు పడుతున్నాం..
-,బందెలా చంద్రయ్య,రైతు.ఎస్.లింగోటం
కొనుగోలు కేంద్రాల్లోని కల్లాల్లో ధాన్యం పోసి ఇబ్బందులు పడుతున్నాం.మబ్బులు వస్తే చాలు ఉరుకులు పరుగులు అన్నట్లుగా ఉంది. కుప్పలు కాపలా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది.ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేస్తుందని కండ్లల్లో ఓత్తులుపెట్టుకొని చూడాల్సి వస్తుంది. కొనుగోలు వెంటనే మొదలు పెట్టాలి.
త్వరలోనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తాం..
శ్రీనివాస్ రెడ్డి,జాయింట్ కలెక్టర్ యాదాద్రి
ధాన్యం కోనుగోలుకు సంబంధించి మిల్లర్లతో సమావేశం జరిగింది. మిల్లులకు ట్యాగింగ్ కూడా మొన్ననే ఇచ్చాము.యాదాద్రి జిల్లా వ్యాప్తంగా సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశాం. దీనికి తగిన విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం.గన్ని బ్యాగులు 35 లక్షలు నిల్వ ఉన్నాయి.కొనుగోలు మొదలవగానే డిమాండ్ కు తగ్గట్టు బ్యాగులు తెస్తాం.కొరత ఏమి లేదు.రవాణా చేయడానికి కాంట్రాక్టర్లతో కూడా మాట్లాడం జరిగింది.లారీ సప్లైపై స్పష్టత రెండు రోజుల్లో వస్తుంది.అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తూ,వారం లోపల కొనుగోలు ప్రారంభిస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ప్రతి గింజను కొనుగోలు చేస్తాం.