Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరప్రసాదరావు కుటుంబ నేపధ్యం
1928లో మునగాల మండలం జగన్నాథపురం గ్రామంలో కొల్లు భద్రయ్య, కాంతమ్మ దంపతులకు మొదటి సంతానంగా జన్మించినాడు. అప్పటికే వీరి తండ్రి 300 ఎకరాల భూస్వామి. వీరి భూములు జగన్నాథపురం, సీతానగరం, రేపాల, కేశవాపురం, నర్సింహుమలగూడెం, ఎక్లాస్కంపేట గ్రామాల్లో విస్తరించి ఉండేవి. ధైర్యవంతుడైన భద్రయ్య గుర్రం మీద తిరుగుతూ, ఈ ఆరు గ్రామాల్లోని వ్యవసాయాన్ని జీతగాళ్లతో చేయిస్తూ, పర్యవేక్షణ చేస్తుండేవాడు. వీరికి ఆరుగురు సంతానం, మొదటి వాడే కొల్లు వరప్రసాదరావు. రెండో వాడు వెంకటేశ్వరావు ఓపిడీఆర్లో పనిచేసి ఇటీవలే మరణించారు. మూడో వాడు రాధాకృష్ణ టీచర్‌గా పనిచేసి విశ్రాంత జీవితం గడుపుతున్నాడు. నాల్గవవాడు జగన్మోహన్రావు. వ్యవసాయం చేసుకుంటూ ఇటీవలనే మరణించారు. చివరి వాడు మధుసూధనరావు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీత. ప్రముఖ పీఆర్టీయూ నాయకులు. చివరిగా కూతురు సుశీల జన్మించింది. ఈమెను అన్నవారిగూడెంకు చెందిన గుడిపూడి సుబ్బారావుకి ఇచ్చి వివాహం చేశారు. సుబ్బారావు ప్రముఖ కథా రచయిత. 'మునగాల పరగణా కథలు-గాధలు' పేరుతో రెండు చారిత్రక కథా సంపుటాలు వెలువరించారు.
బాల్యంలోనే కొరియర్‌గా మన్ననలు
వరప్రసాదరావు ప్రాథమిక విద్యను జగన్నాథపురంలోనూ, జగయ్యపేటలో తొమ్మిదో తరగతి వరకు చదివాడు.ఆనాడు తెలంగాణలో నిజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ఉదృతంగా సాయుధ పోరాటం కొనసాగుతోంది. జగ్గయ్యపేట ఆంధ్రా ప్రాంతంలోనిది. నిజాం పోలీసులు ఆ పట్టణంలో అడుగుపెట్టేందుకు అధికారంలేదు. దీనితో కమ్యూనిస్టు నాయకులైన దేవులపల్లి వెంకటేశ్వరరావు, కేశబోయిన ముత్తయ్య మొదలగు వారు జగ్గయ్యపే టలో షెల్టర్ తీసుకొని అండర్‌గ్రౌండ్‌లో ఉండే వారు. బాలుడిగా ఉన్న ప్రసాదరావు తెలంగాణ ప్రాంతం నుండి సమాచారాన్ని లేఖల రూపంలో తన లాగు కింద ఉన్న లంగోటిలో దాచుకొని వెళ్లి నాయకులకు అందజేసే వాడు. ఈ విధంగా చిన్ననాడే కమ్యూనిస్టు పార్టీకి కొరియర్‌గా పనిచేసి నాయకుల మన్నన పొందాడు.
ముత్తయ్య స్నేహంతో కమ్యూనిస్టుగా....
కేసబోయిన ముత్తయ్యది జగన్నాథపురం. పుట్టుకతోనే అభ్యుదయ భావాలు కలిగిన ప్రసాదరావుకు, ముత్తయ్యకు స్నేహం కుదిరింది. తనలో కమ్యూనిస్టు బీజాలు నాటింది, ఉద్యమం వైపు నడిపించింది కేశబోయిన ముత్తయ్యనే అని చాలా సభల్లో గర్వంగా చెప్పుకునే వాడు. ముత్తయ్య పార్టీ దళ సభ్యుడే కాదు, మంచి కళాకారుడు. చక్కని కమ్యూనిస్టు ఆర్గనైజర్కూడా. ముత్తయ్య వెంట తరచుగా సభలకు, సమావేశాలకు వెళుతుండేవాడు. అలా పరిచయమైన వారే రేపాల గ్రామ వాసి కోదాటి లక్ష్మీ నరసింహారావు( కేఎల్)గారు.
కళాకారుడిగా కమ్యూనిస్టు భావజాల వ్యాప్తి
మునగాల పరగణాలోని రేపాల గ్రామంలో 'గ్రామ వెలుగు నాట్య కళా మండలి' స్థాపించి నాటి జమీందారి వ్యవస్థకు వ్యతిరేకంగా, కమ్యూనిస్టు ఉద్యమానికి అనుకూలంగా అనేక నాటకాలు, కళారూపాలు ప్రదర్శించారు. వీరి కళా బృందంలో వేముల నర్సింహం, గంధం నర్సయ్య, సిరిపురం పూజారి చివులూరి లక్ష్మి నరసింహచారి, రేపాల పూజారి భద్రయాచారి, లింగగిరికి చెందిన శ్రీరామ కవచం సత్యనారాయణ, కొల్లు వరప్రసాద్‌లు ప్రముఖులు. కేఎల్ నాటకం రాసేవారు.అనుచరులు వాయిద్యకారులుగా, నటులుగా గ్రామాల్లో ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ నాటి సమాజాన్ని, వీరి నాటకాలు ఆలోచింపజేయడమే కాకుండా, గొప్ప చైతన్యమూ, కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఎంతగానో తోడ్పడ్డాయి.
స్నేహానికి, గురుత్వానికి అపార గౌరవం
ప్రసాదరావు తన తల్లిదండ్రుల తరువాత ముత్తయ్యను కేఎల్ గారినే పూజించేవారు. తన తల్లిదండ్రుల ఫొటోల పక్కన ముత్తయ్య, కేఎల్ గారల ఫొటోలు ఉంచి ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో భద్రంగా పెట్టుకున్నారు. స్నేహానికి గురుత్వానికి వారిచ్చిన గౌరవం అలాంటిది. వీరందరితో పాటు తానూ కళా బృందంలో సభ్యుడైనాడు. తనకున్న గేయ రచనా ఆసక్తితో అమరులైన కళాకారుల మీద,నచ్చిన నాయకులమీద గేయాలు రాసి సంస్మరణ సభల్లో పాడుతుండేవాడు.
గేయ రచయితగా గుర్తింపు
తాను రాసిన గేయాలన్నీ కలిపి 'గీతికా రవళి' పేరుతో ప్రచురించారు. వీరు కులాలకు , మతాలకు అతీతంగా ఆలోచించి, ప్రజల తరుపున తన గళం, గేయాల ద్వారావినిపించేవారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 'ఓరోరి చంద్రబాబు నీ సంగతేందిరో.. అన్న గారి వరమిదియని ప్రజలంతా చెప్పుకునే రెండు రూకల బియ్యం మూడున్నర చేస్తివిరా, అన్నదాత రైతులకు అన్న చేసినట్టి మేలు, విద్యుత్తు, నీటిపన్ను అపారంగా పెంచితివిరా...' అంటూ చంద్రబాబు దుర్నీతిని ఎండగట్టాడు. తాను పాల్గొన్న ప్రతి సభలోనూ, అవినీతిని, అక్రమాలనూ దునుమాడుతూ, అభ్యుదయాన్ని కాంక్షిస్తూ గేయాలాపన చేసేవాడు.
పీఏసీఎస్ అధ్యక్షులుగా రైతులకు ఎనలేని సేవ
తన సాహితీ మిత్రులతో కలిసి 'కొమర్రాజు వెంకట లక్ష్మణరాయ సాహితీ, సాంస్కృతిక సమాఖ్య' నెలకొల్పి కొంత కాలం నడిగూడెంలో నాటకాలు వేశారు. ప్రజలు కళా సాంస్కృతిక రంగం వైపు ఆకర్శింపబడేలా కృషి చేశారు. వీరి నిస్వార్థ సేవను గమనించిన జగన్నాథపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులు అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. తాను పనిచేసిన కాలంలో రైతులకు, మందులు, విత్తనాలు, రుణాలు అందజేయడంలో ఎంతో శ్రద్ధ చూపి రైతుల అభిమానాన్ని చూరగొన్నాడు. వెలిదండలో విద్యుత్ సౌకర్యం లేని సమయంలో తను అధికారుల చుట్టూ తిరిగి డబ్బు ఖర్చు చేసి గ్రామానికంతా కరెంటు సౌకర్యం కలిగేలా కృషి చేశాడు.
నిరాడంబరంగా వివాహం
వీరి మేనమామ వక్కవంతుల మట్టయ్య, ఆనాడు వెలిదండ గ్రామ పట్వారీగా పనిచేస్తూ నిజాం ప్రభుత్వానికి తాబేదారుగా పనిచేసేవారు. ఇతని వలన స్త్రీలు, పేదలు, కమ్యూనిస్టులు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. ఆనాటి గెరిల్లా దళ కమాండర్ దొడ్డా నర్సయ్య నాయకత్వంలో మేదరమెట్ల మట్టయ్య, సీతారామయ్య మొదలగు వారు ప్రజాకోర్టు పెట్టి మట్టయ్యను శిక్షించారు. వీరి కూతురు అమృతాంబనే వీరు వివాహం చేసుకున్నారు. మునగాల పోలీస్‌స్టేషన్‌లో దండల మార్పిడి ద్వారా వివాహం పెద్దల సమక్షంలో జరిగింది. తన మేనమాను కమ్యూనిస్టులు చంపివేసినా, ఉద్యమం మీద కానీ నాయకులమీద కానీ ద్వేషం పెంచుకోలేదు. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలినప్పుడు సీపీఐ(ఎం) పార్టీ వైపు నిలబడ్డాడు. తన ఊపిరి ఉన్నంత వరకూ అదే పార్టీలో నిబద్ధతతో కొనసాగాడు. ధనార్జన మీదకానీ, కీర్తి మీద కానీ ఆవగింజంత ఆనురక్తి పెంచుకోలేదు. ఎలాంటి వ్యసనాలనూ దరిదాపుల్లోకి రానిచ్చేవారు కాదు. తన బంధువులు, మిత్రులు ఎవరైనా ధూమపానం, మద్యం తదితర వ్యసనాల్లో కనిపిస్తే గట్టిగా మందలించి సరిదిద్దేవాడు.
పాఠశాల తాగునీటి సమస్యకు 25వేల విరాళం
గ్రామంలో ఏ మంచిపని తలపెట్టినా, పార్టీలకు అతీతంగా తాను ముందుం డేవాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వెలిదండ ఉన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయుడు తనను ఆహ్వానించినప్పుడు విద్యార్థుల తాగునీటి ఇబ్బందిని గమనించి వేదికమీద అప్పటికప్పుడు 25వేల రూపాయలు ప్రకటించి మంచి నీటి ట్యాంక్ ఏర్పాటు చేయించారు.
దళితులపట్ల అమిత ప్రేమ
వెలిదండ గ్రామంలో దళిత ప్రముఖుడు చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులతో పాటు తనూ పాడెను పట్టి శ్మశానం వరకూ మోసి నివాళులు అర్పించాడు. తన మరణానంతరం తన శరీరాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించడంతో దహన సంస్కారాలు ఉండవు కాబట్టి మృత దేహానికి కట్టెలు కొట్టి, దహనం చేసే దళితులకు తన మరణం వల్ల ఆదాయం కోల్పోకూడదని దూరపు చూపుతో ఆలోచించి, వారికి శ్మశానంలో శవాన్ని కాలిస్తే ఎంత కూలి గిట్టుబాటు అవుతుందో అంత డబ్బు వారికి చెల్లించ వలసిందిగా తన వారసులకు ముందుగానే తెలియజెప్పాడు. పేదల పట్ల వారికి ఎంత అమితమైన ప్రేమ ఉందో ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి.
జీతగాళ్లకు అరుదైన గౌరవం
తన తల్లి దండ్రుల ఏడాది మాసికం నాడు తన కుటుంబానికి వ్యవసాయం పనిలో సహకరించిన ఐదుగురు జీతగాళ్లను, తన ఇంట్లో కుర్చీలో కూర్చోబెట్టి వారికి నూతన వస్త్రాలు పెట్టి 'భూమి మాదైనా, మీరు కష్టం చేసి పంటలు పండించడం వల్లనే మేము నిశ్చింతగా బతకగలుగుతున్నాము. మేము తినే తిండి మీరు పెట్టిన బిక్షనే' అని సవినయంగా చెప్పి వారిని ప్రశంసించాడు. శ్రామికుల పట్ల వారికున్న నిబద్దతకు ఈ సంఘటన చక్కని తార్కాణము. తన కుటుంబానికి 40 ఏళ్లుగా జీతం చేసిన గుంపుల గ్రామ వాసి నకిరికంటి గోపయ్యకి ఎకరం భూమి రాసి ఇచ్చాడు. భద్రయ్య 47వ ఏట మరణించగా వ్యవసాయం చేయించడానికని వచ్చిన, బంధువు వక్కవంతుల నారాయణకు వీరి తల్లి కాంతమ్మ వివాహం చేయడమే కాకుండా 13 ఎకరాల భూమిని నారాయణ పేరున రాసి ఇచ్చింది.
మహిళాభ్యుదయవాది
తన భార్యపట్ల ఏనాడూ పరుషంగా ప్రవర్తించి ఎరుగడు. తన మరణనంతరం తాను కట్టిన తాళి తప్ప స్త్రీలు అలంకారంగా పెట్టుకునే పూలు, గాజులు, బొట్టూ, కాటుక వంటివి తీయవద్దని తన భార్యతో మాట తీసుకున్న మహిళా అభ్యుదయ వాది.చనిపోయిన తర్వాత కూడా తన భౌతిక కాయం ప్రజలకు ఉపయోగపడాలని కళ్లను ఐ బ్యాంకుకు, దేహాన్ని ఖమ్మం మెడికల్ కాలేజీకి అప్పగించమని వీలునామా ముందుగానే రాశారు. వారి కోరిక ప్రకారమే శరీరాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించడం జరిగింది.
ఆస్తులమ్మి కళాపీఠం నిర్మించాలని వీలునామా
తన పేరున ఉన్న ఆస్తిని అమ్మి, తమ దంపతుల పేరున ' కొల్లు వరప్రసాద రావు-అమృతాంబల గ్రామీణ కళాపీఠం' ఏర్పాటుచేయవలసిందిగా వీలునామా రాశాడు. అమ్మిన ఆస్తి వలన వచ్చిన డబ్బును బ్యాంక్‌లో వేసి దానిపై వచ్చే వడ్డీతో ప్రతిసంవత్సరం జగన్నాథపురం, రేపాల, నడిగూడెం, వెలిదండ గ్రామాల్లో, సామా జిక స్పృహ కలిగించే వైజ్ఞానిక కార్యాక్రమాలకు, ముఖ్యంగా చెక్కభజన, కోలాటం, యక్షగానం మొదలగు కళారూపాల కోసం కృషి చేసే కళాకారులకు లేదా సంస్థ లకు తమ పేరున ఏర్పాటు చేసిన అవార్డు ఇవ్వాలని కోరుతూ ఒక ట్రస్టు ఏర్పాటు చేయమని వీలునామాలో రాశారు. కుల మతాలకు అతీతంగా తన మిత్రులు, బంధువులు అయిన ఐదుగురు సభ్యులను ట్రస్ట్ మెంబర్లుగా ప్రకటించారు.
గ్రంథాలయానికి పుస్తకాల వితరణ
'నేను మరణించాక, నా పుస్తకాలను గ్రంథాలయానికి ఇవ్వండి. నా దుస్తులు బీదవారికి ఇవ్వండి. నా శరీరాన్ని పరిశోధనల కోసం మెడికల్ విద్యార్థులకు ఇవ్వండి' అని ప్రకటించి మన నుంచి ఈ నెల 20వ తేదీన వెళ్లిపోయిన కొల్లు వర ప్రసాదరావుగా గొప్ప కమ్యూనిస్టు ఆచరణ శీలి. కళా హృదయమున్న చక్కని మానవతావాది.
కొల్లు వరప్రసాదరావు సంస్మరణ సభ ఈ నెల 30వ తేదీన వెలిదండలో జరుగుతున్న సందర్భంగా వారికిదే సూర్యాపేట జిల్లా సాహితీ స్రవంతి తరపున అరుణాంజలి.
- పుప్పాల కృష్ణమూర్తి, రచయిత.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు
సెల్: 9912359345.