Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
యాసంగి వరి పంట సేద్యంపై రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాసంగి వరి పంట వేయవద్దని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి, జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులు హుకుం జారీ చేయడం తగదన్నారు. సూర్యాపేట జిల్లాలో ఉన్న భూములు వరి పంటకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. జిల్లాలోని ఈ భూముల్లో ఇతర పంటలు పండే అవకాశం లేదని స్పష్టం చేశారు. అది తెలియకుండా మంత్రి జగదీశ్ రెడ్డి యాసంగి వరి పంట సేద్యం వద్దుని చెప్పడంలో అర్థం లేదన్నారు.రైతులు పండిస్తున్న వరి పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే ప్రత్యామ్నాయ పంటలకు గిట్టుబాటు ధర ఎవరు ఇస్తారని, దానికి బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల విషయంలో ముందుచూపు ధోరణితో వ్యవహరించి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతాంగానికి అవగాహన కల్పించాలని సూచించారు. రబీ సీజన్ లో వరి ధాన్యాన్ని పండించ వద్దని విత్తనాలు విక్రయించే ట్రేడర్స్ పై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం, అధికారులు బెదిరింపులకు పాల్పడిన తగదన్నారు. రైతాంగం వరి పంట వేయకుంటే ప్రాజెక్టులూ ఎందుకని ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లాలో 80% మంది రైతులు వరి పంటపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. కేరళ ప్రభుత్వం మాదిరిగా క్వింటా కు రూ 750 రూపాయలు బోనస్ ఇవ్వాలని కోరారు. వరి పంటకు కనీస మద్దతు ధర రూ.1960 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు దండ వెంకట్ రెడ్డి, మట్టిపెళ్లి సైదులు, కోట గోపి, ఎలుగూరి గోవింద్, మేకనబోయిన శేఖర్ పాల్గొన్నారు.