Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులలో అపోహలు తొలగించాలి
- వానాకాలం పంట ప్రభుత్వం కొనుగోలు
- జిల్లాలో 333 కేంద్రాలు ఏర్పాటు
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ- సూర్యాపేట
జిల్లాలో వానాకాలం పంట ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, యాసంగిలో లాభదాయక పంటలపై రైతులు దృషిసారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్ నందు జిల్లా కలెక్టర్ టి.వినరు కష్ణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు, వానాకాలంలో ధాన్యం కొనుగోలు సమీక్షలో ఆయన మాట్లాడారు. కరోనా కష్ట కాలంలో కూడా రైతులు పండించిన ప్రతి గింజను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు. సమగ్ర వ్యవసాయ విధానంపై రైతులకు రైతు వేదికల ద్వారా పంటల సాగుపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ఎఫ్‌సీఐ యాసంగి పంటను కొనుగోలు చేయదని తెలపడంతో రైతులు ఇబ్బంది పడకుండా వరికి బదులు లాభదాయక పంటలు పండించుకోవాలని, మార్కెట్లో ధర అధికంగా ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.ఈ వానాకాలంలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతి అయ్యే అవకాశం ఉన్నందున జిల్లాలో 333 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.అన్ని కేంద్రాల కోసం 270 ధాన్యం శుభ్రత మిషన్లు కొనుగోలు చేసినట్టు చెప్పారు. ధాన్యం కొనుగోలును మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే బ్లాక్ లిస్ట్‌లో పెడతామని , నాణ్యతగా లేదని ధాన్యం ధర తగ్గిస్తే చర్యలు తప్పవని, రైతులకు తప్పక మద్దతు ధర కల్పించాలని హెచ్చరించారు.కొనుగోలు కేంద్రాలలో ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కలగకుండా అదికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని,ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యాన్ని సహించబోనని అధికారులను హెచ్చరించారు.యాసంగి పంటలపై రైతులకు వాస్తవ పరిస్థితులు వివరిస్తామని అన్నారు. జిల్లాలో ఈ సంవత్సరం 750 ఎకరాలలో పామాయిల్ పంట సాగులో ఉందని, వచ్చే మూడు సంవత్సరాలలో 20 వేల ఎకరాలలో సాగుకు రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఉమ్మడి నల్లగొండ చైర్మన్ వట్టే యాదయ్య,జెడ్పి వైస్ చైర్మన్ గోపాగాని వెంకట నారాయణ గౌడ్,జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్,అదనపు కలెక్టర్ యస్.మోహన్ రావు,డిఏఓ రామారావు నాయక్,డియస్ఓ విజయలక్ష్మి,ఉద్యానవన శాఖ అధికారి శ్రీధర్, డిఆర్డీఏ పిడి ఎస్.కిరణ్ కుమార్,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,వివిధ పోలీస్ అధికారులు,వ్యవసాయ అదికారులు, వాహనాల తనిఖీ అధికారి,మిల్లర్స్ తదితరులు పాల్గొన్నారు.