Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వలిగొండ జంక్షన్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు జాతీయ రహదారి
- వలిగొండ-తొర్రూర్ రోడ్డుకు మహర్దశ
- యాదాద్రి జిల్లాలో సుమారు 47 కిలోమీటర్లు రోడ్డు విస్తరణ
- నేషనల్ హైవే 930పీగా పేరు ఖరారు
- ఫే˜జ్ -1లో రూ.600 కోట్లు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం
- అడ్డగూడూరు మండలం చెళ్లరామారం వద్ద టోల్గేట్
నవతెలంగాణ-మోత్కూరు
యాదాద్రిభువనగిరి జిల్లా మీదుగా మరో జాతీయ రహదారి మంజూరైంది. హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డును కలిసేలా యాదాద్రిభువనగిరి జిల్లాలోని వలిగొండ (గౌరెల్లి జంక్షన్) (వలిగొండ- తొర్రూర్ రోడ్డు) నుంచి భద్రాద్రికొత్తగూడెం వరకు రోడ్డును విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ మాల ప్రయోజన స్కీంలో జాతీయ రహదారిగా ఎంపిక చేసింది. యాదాద్రి, సూర్యాపేట, మహమూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను కలుపుతూ సుమారు 234 కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డును ఆర్ అండ్ బీ నుంచి జాతీయ రహదారులశాఖ కిందకు మార్చి రూ.2 వేల కోట్ల అంచనా వ్యయంతో మూడు ఫేజుల్లో ఈ రహదారి విస్తరణ పనులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రహదారి విస్తరణ చేసేందుకు నేషనల్ హైవే అథారిటీ అధికారులకు అప్పగించడంతో డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) రూపొందించే పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి.
నేషనల్ హైవే 930పీగా పేరు ఖరారు
వలిగొండ (గౌరెల్లి జంక్షన్) నుంచి భద్రాద్రికొత్తగూడెం జాతీయ రహదారికి నేషనల్ హైవే అథారిటీ అధికారులు 930పీ నెంబర్ కేటాయించారు. జిల్లాలోని వలిగొండ, ఆత్మకూరు(ఎం), మోత్కూరు, అడ్డగూడూరు మండలాల మీదుగా వెళ్లనున్న ఈ రహదారి జిల్లాలో సుమారు 47 కిలోమీటర్లు రోడ్డు విస్తరణ జరగనుంది. వలిగొండ జంక్షన్ నుంచి తొర్రూర్ వరకు 69 కిలోమీటర్ల వరకు ఉన్న రోడ్డును ఫేజ్- 1 కింద అభివద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.600 కోట్ల నిధులు మంజూరు చేసింది. సుమారు రెండు నెలలుగా నేషనల్ హైవే అథారిటీ ఇంజనీరింగ్ అధికారులు డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) రూపొందించే పనిలో నిమగమయ్యారు. ఆ పనులు కూడా దాదాపుగా పూర్తికావచ్చాయని చెబుతున్నారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లు రోడ్డు వెళ్లే గ్రామాలు, పట్టణాల్లో నివాస గహాలు, స్థలాలు కోల్పేయే వారి జాబితా కూడా సిద్ధం చేస్తున్నారు. రోడ్డు బౌండ్రీని గ్రామాలు, పట్టణాల్లో వంద ఫీట్లుగా, గ్రామాల బయట 150 ఫీట్లుగా చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వలిగొండ నుంచి తొర్రూర్ వరకు ఉన్న డబుల్ బీటీ రోడ్డు మరో పది ఫీట్ల మేర విస్తరించనుంది. బ్రిడ్జిలు, కల్వర్టులు నిర్మించే స్థలాలను కూడా గుర్తించారు. అడ్డగూడూరు మండలం చిర్రగూడూరు, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం అనంతారం గ్రామాల మధ్యనున్న బిక్కేరు వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించనున్నారు. అందుకు సంబంధించి మార్కింగ్, సాయిల్ టెస్టింగ్ కూడా పూర్తి చేశారు. డీపీఆర్ ఫైనల్ స్టేజీలో ఉందని, త్వరలోనే పూర్తి చేసి ఢిల్లీలోని మినిస్ట్రి ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ (మోర్త్)కు అందజేస్తామని, టెండర్లు ఖరారు కాగానే పనులు ప్రారంభిస్తారని నేషనల్ హైవే ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.
అడ్డగూడూరు మండలం చెళ్లరామారం వద్ద టోల్గేట్
వలిగొండ-భద్రాద్రికొత్తగూడెం జాతీయ రహదారిలో భాగంగా యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలంచౌళ్లరామారం గ్రామ సమీపంలో టోల్ గేట్ ఏర్పాటు చేయనున్నారు. జిల్లా సరిహద్దు అయిన అడ్డగూడూరు మండలం చిర్రగూడూరు గ్రామం వరకు సుమారు 47 కిలోమీటర్లు విస్తరించిన రహదారిలో చౌళ్లరామారం గ్రామం వద్ద టోల్ గేట్ ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. టోల్ గేట్ ఏర్పాటుతో భూములు కోల్పోయి తాము నష్టపోతున్నామని, తమ భూముల్లో టోల్ గేట్ ఏర్పాటు చేయవద్దని కోరుతూ ఆ గ్రామ రైతులు ఇటీవల అడ్డగూడూరు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. టోల్ గేట్ ఏర్పాటుతో వ్యవసాయాధారిత వాహనాలు, ఆటోలు మినహా ఉపాధి కోసం ట్రాన్స్ పోర్ట్ లాంటి వాహనాలు నడపుకుంటున్న వారిపై టోల్ ఫీజు భారం పడనుంది.
భూముల ధరలకు రెక్కలు
వలిగొండ -భద్రాద్రికొత్తగూడెం జాతీయ రహదారితో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. ఇప్పటికేవలిగొండ -తొర్రూర్ రోడ్డు వెంట ఎకరా రూ.50, 60 లక్షలు పలుకుతుండగా, జాతీయ రహదారిమంజూరుతో రూ.కోట్లకు చేరింది. జాతీయ రహదారి మంజూరైనట్లు కొందరు రైతులకు తెలియకపోవడంతో రాజకీయ నాయకులు, రియల్టర్లు తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసే పనిలో నిమగమయ్యారంటున్నారు. ఇటీవల అడ్డగూడూరు మండలం కంచనపల్లి గ్రామంలో మెయిన్ రోడ్డు వెంట ఉన్న భూములను ఎకరాకు రూ.70 లక్షలకు కొనేందుకు కొందరు రియల్టర్లు రైతులను సంప్రదించగా జాతీయ రహదారి వెళుతున్న విషయం తెలిసిన రైతులు తక్కువ ధరకు అమ్మేందుకు నిరాకరించారు. రోడ్డుకిరువైపులా ఉన్న పెద్ద పెద్ద చెట్లు రోడ్డు వెడల్పులో తొలగించనున్నారు. జాతీయ రహదారితో రవాణా సదుపాయం కూడా బాగా మెరుగుపడనుంది. మోత్కూరు -తిరుమలగిరి రూట్లో పాటిమట్ల ఎక్స్ రోడ్డు నుంచి తిరుమలగిరి వరకు రోడ్డు బాగా దెబ్బతిని పెద్ద పెద్ద గుంతలు పడి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి విస్తరణ పనులు జరిగే వరకైనా పెద్ద పెద్ద గుంతలను పూడ్చి రోడ్డును మరమ్మతు చేయాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.
డీపీఆర్ ఫైనల్ స్టేజీలో ఉంది
పంజాల శరత్ చంద్ర, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, హైదరాబాద్
వలిగొండ (గౌరెల్లి జక్షన్) నుంచి భద్రాద్రికొత్తగూడెం వరకు జాతీయ రహదారి డీపీఆర్ ఫైనల్ స్టేజీలో ఉంది. ఈ జాతీయ రహదారికి 930పీ నంబర్ కూడా కేటాయించారు. వలిగొండ నుంచి తొర్రూర్ మెయిన్ రోడ్డు బైపాస్ వరకు 69 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులను ఫేజ్- 1లో చేయనున్నాం. కేంద్ర ప్రభుత్వం రూ.600 కోట్ల నిధులు కూడా కేటాయించింది. డీపీఆర్ ను కూడా త్వరలోనే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్టు అండ్ హైవేకు అందజేస్తాం. డీపీఆర్ అందజేసిన వెంటనే టెండర్లు పూర్తయ్యే అవకాశముంది.