Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామాలకు నడవని ఆర్టీసీ బస్సులు
- ఇబ్బందులు పడుతున్న మోడల్ స్కూల్ విద్యార్థులు
- కాలినడకన,ఆటోలు,సైకిళ్లపై వెళుతున్న వైనం
నవతెలంగాణ-గుండాల
గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో మోడల్ స్కూల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పాఠశాలలు తెరిచి నాలుగు మాసాలు కావస్తున్నా బస్సులు నడవకపోవడంతో విద్యార్థులు సకాలంలో పాఠశాలలకు వెళ్లలేక,బడి వదిలిన తర్వాత ఇండ్లకు చేరుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు.
మండలంలో సగానికిపైగా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడవడం లేదు.కరోనాకు ముందు నడిచిన బస్సులను కూడా ఆర్టీసీ అధికారులు రద్దు చేయడంతో విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.గుండాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో బండకొత్తపల్లి, వస్తాకొండూరు, పెద్దపడిశాల, తుర్కలషాపురం, వంగాల గ్రామాల నుంచి సుమారు 220 మంది విద్యార్థులు చదువుతున్నారు.ఆయా గ్రామాల నుంచి ఉదయం వేళ బస్సులు లేకపోవడంతో విద్యార్థులు సకాలంలో పాఠశాలకు చేరుకోలేక తరగతులను కోల్పోతున్నారు. సాయంత్రం పాఠశాల వదిలిన తర్వాత సుద్దాల,బ్రాహ్మణపల్లి విద్యార్థులు ఇళ్లకు వెళ్లడానికి బస్సుల కోసం గుండాల బస్టాండ్లో రాత్రి 7 గంటల వరకు వేచి ఉంటున్నారు.మరిపడిగ గ్రామ విద్యార్థులు ఉదయం పాచిల్ల గెస్ట్ హౌస్ నుండి మోడల్ స్కూల్ నడుచుకుంటూ రావడం,మధ్యాహ్నం 3 గంటలకే పాఠశాల నుంచి వెళ్లాల్సి వస్తుంది.ఇటు ఉదయం అటు సాయంత్రం విద్యార్థులు ఆయా సబ్జెక్టుల తరగతులను కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే కరోనాతో సుమారు ఏడాదిన్నర పాటు పాఠశాలలకు దూరమైన విద్యార్థులు ఇప్పుడు బస్సుల కారణంగా తరగతులు కోల్పోవాల్సి వస్తుందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి మోడల్ స్కూల్ కు విద్యార్థులు చేరుకునేలా యాదగిరిగుట్ట,జనగాం డిపోల నుంచి బస్సులు నడపాలని విద్యార్థులు కోరుతున్నారు.
విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు
డా:కె సురేష్ బాబు ప్రిన్సిపాల్ మోడల్ స్కూల్, గుండాల
పాఠశాల సమయానికి విద్యార్థులు చేరుకోవడానికి గ్రామాల నుంచి బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలినడకన, సైకిళ్లపై వస్తుండడంతో అలసిపోయి మానసిక ఆందోళనకు గురవుతున్నారు. బండకొత్తపల్లి రూట్ నుండి పాఠశాలకు 220 మంది విద్యార్థులు వస్తున్నారు.ఆర్టీసీ అధికారులు స్పందించి స్కూల్ వరకు బస్సు సదుపాయం కల్పించాలి.
ఎమ్మెల్యే గారు బస్సు వేయించండి
విద్యార్థి రస్తాపురం భవిత,6 వ.తరగతి,బండకొత్తపల్లి.గ్రామం
నేను గుండాల మోడల్ స్కూల్లో 6 వతరగతి చదువుతున్న.మా గ్రామం నుంచి బస్సు లేకపోవడంతో రోజూ 13 కిలోమీటర్ల నుంచి సైకిల్ పై వస్తున్నా.పాఠశాలకు వచ్చేసరికి అలసి పోతున్నా.ఉపాధ్యాయులు చెప్పే పాఠాలపై దష్టి పెట్టలేక ఇబ్బంది పడుతున్నా.ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి మా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి.