Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంకా గ్రామాల్లో దళితులపై కొన సాగుతున్న కులవివక్ష, అంటరానితనం
- కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి
నవతెలంగాణ-చివ్వెంల
సమాజంలో నేటికీ కొనసాగుతున్న కుల వివక్ష,అంటరానితనంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, దాని మూలంగానే ఇంకా దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా కుల వివక్ష ఇప్పటికీ కొనసాగుతుందని కేవీపీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి కోట గోపి విమర్శించారు.ఇటీవల బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డు దురాజ్‌పల్లిలో దళిత మహిళల వివక్ష చూపించిన అగ్రకులస్తులపై పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.కాగా ఆయన శుక్రవారం బాధితురాలు ఇరుగు రమణను కలిసి ఘటన వివరాలు తెలుసుకున్నారు.అనంతరం మాట్లాడుతూ జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో గల దురాజ్‌పల్లిలో బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా దళిత మహిళలకు కులవివక్ష,అవమానం జరిగిందని పేపర్లలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలొచ్చా యన్నారు.అయినా నేటికీ సంబంధిత అధికారులుగానీ, కలెక్టర్‌గానీ గ్రామాన్ని సందర్శించి వివరాలు తెలుసుకోకపోవడం దుర్మార్గమన్నారు. బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా అగ్రకులస్తులు మాదిగోళ్లు తమతో బతుకమ్మ ఆడవద్దని వివక్ష పాటిస్తే దళిత మహిళలు ఎదురించారన్నారు.దీంతో కులవివక్ష పాటించిన అగ్రకులాలవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందన్నారు.దీంతో అగ్ర కులస్తులు ఆమెను కేసు విత్‌డ్రా చేసుకోవాలని ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా భయపడలేదన్నారు.కేసు విత్‌డ్రా చేసుకుంటే డబ్బులిస్తామని ప్రలోభపెట్టినా వద్దని అదే డబ్బులతో గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే కేసు విత్ డ్రా చేసుకుంటానని చెప్పడం అభినందనీయమన్నారు.అంబేద్కర్ భావజాలాన్ని గ్రామాల్లో వ్యాపింపచేయడం కోసం దళిత మహిళలు సంకల్పించడం శుభపరిణా మమన్నారు.ప్రతినెలా 30వ తేదీన అంటరానితనం పై అవగాహన కల్పించే పౌర హక్కుల దినోత్సవం సక్రమంగా జరపకుండా ఉండడం మూలంగానే ఇలాంటి ఘటనలు కొనసాగు తున్నాయ న్నారు.ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు జిల్లలో కొనసాగుతున్న కులవివక్షపై అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయాలని కోరారు.సదస్సుల ద్వారా ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకులు పాముల సీతారాములు, కొండేటి ఉపేందర్, జై, దురాజ్ పల్లి గ్రామ దళిత పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.