Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
మండలంలోని రాచకొండ గుట్టల్లో గల సర్వే నెంబర్ 84, 43 లలోని అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కోరుతూ ఆలిండియా బంజారా సేవా సమితి జిల్లా అధ్యక్షులు కట్రోత్ బిక్షపతి నాయక్ ,రాచకొండ మాజీ సర్పంచ్ కట్రోత్ సాగర్ నాయక్ సోమవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాచకొండ గుట్టల్లో ఇటికాల ఇంటి పేరు గల రైతులకు వందల ఎకరాల భూమి ఉందన్నారు. ఆ భూమిని 1972లో వారసులు సర్వే నెంబర్ ప్రకారం బాగ పంపిణీ చేసుకొని భూమి మ్యాప్‌తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం సీలింగ్ యాక్ట్ తీసుకువచ్చిందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సీలింగ్ యాక్ట్ ప్రకారం ఇటికాల ఇంటి పేరు గల రైతులు అవసరం ఉన్న భూమిని తన వద్ద ఉంచుకొని మిగులు భూమిని ప్రభుత్వానికి అప్పజెప్పినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న భూమిని రికార్డుల్లో రాయకుండా వదిలేయడం మూలంగా ఆ భూమీ సమస్యలకు నిలయంగా మారిందని పేర్కొన్నారు. సీలింగ్ చట్టం ప్రకారం అప్పజెప్పిన భూమిని తిరిగి తమకు ఇవ్వాలంటూ కొంతమంది రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కోర్టు వివాదంలో ఉండటంవల్ల ఆ భూమి గతం నుండి నేటి వరకు వారి పేర్ల మీద కొనసాగుతుందని పేర్కొన్నారు. 2006, 2007 లో సీలింగ్ చట్టం ప్రకారం అప్పజెప్పిన భూమిని రైతులు తిరిగి రియల్టర్లకు అమ్ముకున్నట్టు పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల దగ్గర కొనుగోలు చేసిన సీలింగ్ భూమితోపాటు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని సైతం కబ్జా చేసి వెంచర్లు చేశారని తెలిపారు. అసైన్మెంట్ కమిటీ తీర్మానం ప్రకారం పట్టాలు ఇచ్చినప్పటికీ రియల్టర్లు కబ్జా పెట్టినట్లు ఆరోపించారు. రియల్టర్ల తోపాటు పక్కనే గల పెద్ద రైతులు సైతం ప్రభుత్వ భూమిని కబ్జా లకు గురి చేస్తూ స్థానిక రెవెన్యూ అధికారులను ప్రలోభాలకు గురి చేస్తున్నట్టు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమి పరిరక్షించాలని కోరారు.