Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోటీపడి మరీ ఓటర్లను కొన్న ఇరుపార్టీలు
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి
నవతెలంగాణ-పాలకీడు
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. మంగళవారం మండలంలోని జాన్పహాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఇరు పార్టీలు రూ.1000 కోట్లు ఖర్చు చేసి ఓటర్లను పోటీ పడిమరి కొన్నారన్నారు. ఓటర్లను కొనడం కాదు..చేతనైతే రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కిన మోడీ అప్పనంగా రూ.60 లక్షల కోట్ల ఆస్తులను కొందరు కార్పొరేట్ శక్తులకు అమ్మారన్నారు. లాభాల్లో నడిచే రైల్వే, ఎల్ఐసీ, విశాఖ ఉక్కు తదితర లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు. నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగి ఇప్పటికే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వీటికి తోడు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం సరికాదన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లు లక్ష్మీ మాట్లాడుతూ దేశం, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అవమానాలు, దాడులు, దౌర్జన్యాలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.