Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణలో చేతగాని ప్రభుత్వం
రైతులను ఇబ్బంది పెడితే ఉద్యమాలు చేస్తాం
నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
వరి ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని నల్లగొండ పార్లమెంట్ సభ్యులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీ బత్తాయి మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నెల రోజుల నుండి ధాన్యాన్ని యార్డుకు తీసుకొచ్చామని ఇంత వరకు అధికారులు కొనుగోలు చేయలేదని, ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం మొలకలెత్తాయని రైతులు ఉత్తంకుమార్ రెడ్డితో వాపోయారు. స్పందించిన ఎంపీ వెంటనే జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు ఫోన్ చేసి మార్కెట్ యార్డ్లో పోసిన ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయడం లేదని అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో చేతగాని ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 60 నుండి 70 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడ్డారని పేర్కొన్నారు. సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కేసీఆర్ కు ఆంధ్ర కాంట్రాక్టర్ల కమిషన్ మీద శ్రద్ధ రైతులపై లేదని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రతి గింజనూ 1960 మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వరి వేసుకోవద్దని చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కోటి ఎకరాల మాగాణి చేస్తామని చెప్పి రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని మాట ఇచ్చి నేడు వరి ధాన్యాన్ని నిలిపేయాలని రైతులకు సూచించడం విడ్డూరమన్నారు. ఈ కార్యక్రమ ంలో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పున్న కైలాస్ నేత, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ జిల్లపల్లి పరమేష్, నాయకులు చింతల బిక్షం, బొంత వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.