Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రి జగదీశ్ రెడ్డి
పోడు భూముల సమస్య పరిష్కారం,
అటవీ సంరక్షణపై అఖిల పక్ష సమావేశం
నవతెలంగాణ - నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారంతో పాటు అటవీ సంపద సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న పోడు వ్యవసాయదారులకు సమస్యలపై శాశ్వత పరిష్కారం,భవిష్యత్తులో అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా చేపట్టే సంరక్షణ చర్యలపై కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘమైన పోడు సమస్య శాశ్వత పరిష్కారానికై సీఎం నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అందుకు అనుగుణంగా అటవీ హక్కుల చట్టం- 2005 నియమనిబంధనల ప్రకారం పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికి శాశ్వతం పరిష్కారం దిశగా సమస్యకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదన్నారు. జిల్లాలో17,59,885 ఎకరాల జియోగ్రఫీ ప్రాంతం కాగా 1,56,164 ఎకరాలలో అటవీ ప్రాంతం విస్తరించి ఉందని, జిల్లాలోని 13 మండలాల్లో 63 గ్రామాల్లో 164 హ్యాబిటేషన్ లలో 13771 ఎకరాల అటవీ భూమి ఆక్రమణలో ఉందని మంత్రి తెలిపారు. పోడు వ్యవసాయదారులకు న్యాయం చేసేందుకు అడవులను సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సబ్ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. అటవీ హక్కుల చట్టం- 2005 పరిధి కి లోబడి పోడు వ్యవసాయ దారులకు న్యాయం చేకూర్చేందుకు అఖిలపక్ష సభ్యుల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో దాదాపు 8 లక్షల ఎకరాల పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్.ఓ.ఎఫ్.ఆర్.2005 చట్టం, గ్రామ కమిటీలు హ్యాబిటేషన్ వారీగా, డివిజన్ వారీగా,జిల్లా కమిటీలు ఏర్పాటు, కమిటీల బాధ్యతలు గురించి వివరించారు. హరితహారం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా కోట్లాది మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచేందుకు తీసుకుంటున్న కార్యక్రమాలలో అటవీ శాఖ మాత్రమే కాకుండా సబ్బండ వర్గాలు పాల్గొన్నాయని తెలిపారు. రాష్ట్రంలో 24 శాతం అటవీ విస్తీర్ణం ఉండగా, జిల్లాలో 9 శాతం అటవీ విస్తీర్ణం ఉందని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం జిల్లాలో పోడు సాగు చెడుకుంటున్న వ్యవసాయ దారుల నుండి నవంబర్ 8 నుండి దరఖాస్తులు స్వీకరించి, అనంతరం పరిశీలన క్షేత్రస్థాయి సందర్శన, సర్వే తదితర ప్రక్రియకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పోడు వ్యవసాయ దారుల నుండి దరఖాస్తులు ఫారం ఏ లో స్వీకరిస్తామన్నారు.వారం రోజులు స్వీకరించిన అనంతరం విచారణ ఉంటుందని అన్నారు. జిల్లాలోని అడవి దేవులపల్లి, చందంపేట, చింతపల్లి, దామరచర్ల, దేవరకొండ, గుండ్ల పల్లి,మిర్యాలగూడ, నేరేడు గొమ్ము, నిడమనూర్,పి.ఏ.పల్లి,పెద్ద వూర,తిరుమల గిరి సాగర్,త్రిపురారం, మండలాలలో పోడు సమస్య ఉందన్నారు. సమావేశం లో హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఇక ముందు ఎలాంటి అన్యా క్రాంతం ,ఆక్రమణలు జరుగనీయమని, అర్హులైన వారికి హక్కులు కల్పిస్తామని అందరి చే జిల్లా కలెక్టర్ అటవీ సంరక్షణ ప్రతిజ్ఞ చేపించారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల కతీతంగా ,పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని అన్నారు.నిరు పేదలైన వారికి న్యాయం జరగడం తో పాటు అటవీ సంరక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు.ఈ సమావేశంలో రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్,రవీంద్ర కుమార్,భాస్కర్ రావు,గాధరి కిశోర్ కుమార్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు రాం చంద్ర నాయక్, అదనపు కలెక్టర్ వి చంద్రశేఖర్, అటవిశాఖ అధికారి రాంబాబు, డీపీవో విష్ణువర్దన్‌రెడ్డి, మిర్యాలగూడ, దేవరకొండ ఆర్డీవోలు, ఇతర పోలీసు, అటవిశాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్,సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి యం.సుధాకర్ రెడ్డి,టి.డి.పి నల్గొండ పార్లమెంట్ నియోజక వర్గ అధ్యక్షులు దుర్గా ప్రసాద్, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కొర్ర శంకర్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.