Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మిత్తి'మీరిన వ్యాపారం
కాల్‌మనీ తరహాలో దందా
అప్పుకట్టకుంటే అంతే సంగతులు
ఆర్థికంగా నష్టపోతున్నప్రజలు
నవతెలంగాణ-చింతపల్లి
వడ్డీ.. ఈ పేరు వింటేనే ప్రజలు బెంబేలెత్తుతున్నారు.ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్నకొందరు అధిక వడ్డీకి అప్పు ఇస్తూ.. ఆస్తులు తాకట్టు పెట్టు కుంటు న్నారు.ఆ అప్పు చెల్లించలేని పక్షంలో తాకట్టు పెట్టిన ఆస్తులను జప్తు చేసు కుంటున్నారు. మండలంలో వడ్డీ వ్యాపారం మాఫియాగా మారింది.పేద, మధ్యతరగతి కుటుంబాలను పిప్పి చేస్తున్నాయి.అదుపులేని వడ్డీతో అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు.వీరి బారిన పడుతున్న పేదలు ఇండ్లు, భూములు గుల్ల చేసుకుంటున్నారు.అక్రమ వ్యాపారాన్నినియంత్రించాల్సిన అధికారులు వ్యాపారులకే వత్తాసు పలుకుతుండడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.ఇలా అధికవడ్డీలు వసూలు చేసే క్రమంలో పలువురి మరణానికి కారణమైనట్లు ఆరోపణలున్నాయి.ముఖ్యంగా రాష్ట్ర రాజధానికి సమీపంలోనున్న వ్యాపార కేంద్రం, మూడు జిల్లాలకు కేంద్రంగా ఉన్న మాల్ పట్టణంలో ఈ దందా యధేచ్ఛగా సాగుతోంది. అక్రమంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ..పేదల కష్టార్జితాన్ని లాగేసు కుంటున్నారు.
అడ్డగోలు వడ్డీలు...
వడ్డీ వ్యాపారం పేరుతో కొందరు చేస్తున్న దందా సామాన్యులను దివాలా తీయి స్తోంది.ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో అప్పు చేయాల్సి వస్తోంది. ప్రధానంగా పిల్లల చదువులకో, ఇండ్ల నిర్మాణానికో, ప్లాటు కొనుగోలు కోసమో, పిల్లల పెండ్లిండ్లు, ఫంక్షన్లు, ఏదైనా వ్యాపారంలో పెట్టుబడుల కోసమో..ఇలా ప్రతిదానికి అప్పు చేయాల్సిందే. ఇలాంటి సందర్భంలో వడ్డీ వ్యాపారులు 'కొందరు' అడ్డగోలు వడ్డీలతో నడ్డి విరుస్తు న్నారు. కొందరు వడ్డీ వ్యాపారులు ముందుగానే ఆరునెలల వడ్డీని తీసుకుం టున్నారు.వడ్డీ, అసలు కలిపి మళ్లీ కొత్త లెక్క రాసుకోవడం మూలంగా అప్పుభారం ఏడాదిన్నర, రెండేళ్లలో రెట్టింప వుతోంది. వాయిదా ప్రకారం డబ్బు చెల్లించకుంటే వడ్డీలపై వడ్డీలు వేసి ఇబ్బంది పెడుతున్నారు.
రూ.2 కోట్ల పైమాటే..
రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల కేంద్రబిందువైన వెంకటేశ్వరనగర్ మాల్లో ప్రతిరోజూ రూ.కోట్లల్లో వ్యాపారం జరుగుతోంది. ప్రయివేట్, గిరిగిరి, డైలీ వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. చాలామంది రూ.10వేలు మొదలు.. రూ.50లక్షల వరకూ అప్పు ఇస్తున్నారు. ముందుగానే రూ.10 నుంచి రూ.15 వడ్డీని పట్టుకుంటున్నారు.(రూ.వెయ్యి అప్పుగా తీసుకుంటే రూ.150 పట్టుకొని రూ.850 ఇస్తారు) ఇందుకు ఖాళీ చెక్కులు, ప్రామిసరీనోట్లు, తెల్లకాగితాలపై సంతకాలు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు తీసు కుంటున్నారు.బాధితుడు సకాలంలో అప్పు చెల్లించినా..కాగితాలు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నట్లు సమాచారం.మరికొందరు భూములను తాకట్టు పెట్టుకుని దాని విలువలో 40 నుంచి 60 శాతం అప్పు ఇస్తున్నారు.అనివార్య కారణాలతో ఆలస్యమైతే.. అప్పుఇచ్చే సమయంలో రాయించుకున్న కాగితాల ప్రకారం.. యజ మానికి సమాచారం ఇవ్వకుండానే అమ్ము కుంటున్నారు.నిబంధనల ప్రకారం ఆస్తిని హామీగా ఉంచితే 9 శాతం, హామీ లేకపోతే 12శాతం వడ్డీ తీసుకునే అవకాశం ఉంది.కానీ.. ఇక్కడ మాత్రం 40నుంచి45 శాతం వసూలు చేస్తున్నారంటే వ్యాపారుల అక్రమార్జన ఏ స్థాయిలో ఉందో తెలుసు కోవచ్చు.భూములు తాకట్టు పెట్టుకుని అప్పు ఇచ్చేవారు మాల్లో కోకొల్లలుగా ఉన్నారు. మాల్ వ్యాపార కేంద్రం కావడంతో నిత్యం మూడు జిల్లాల నుంచి అనేకమంది రాకపోకలు సాగిస్తుంటారు.
నిర్లక్ష్య ఫలితం..?
అప్పు తీసుకునే వ్యక్తినుంచి ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులు తీసుకోవడం చట్టరీత్యా నేరం.దీనిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.అయితే ఫైనాన్షియర్లు పోలీసులకు మామూళ్లు ముట్టజెపుతుండడంతో బాధితు లకు న్యాయం జరగడం లేదు. ఒకవేళ ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లినా.. చిన్నచిన్న కేసులు పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో చిరువ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు ఫిర్యాదు చేయాలంటేనే జంకుతున్నారు. ప్రయివేటు వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆదేశాలున్నప్పటికీ స్థానిక పోలీసులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
వడ్డీ వ్యాపారుల ఆగడాలను అరికట్టాలి
కురుమేటి శ్రీను, కురుమేడు
ప్రయివేటు వడ్డీ వ్యాపారుల ఆగడాలు అరికట్టాలి.గతంలో మాల్లో వడ్డీకి కొంత అప్పు తీసుకున్నా.అసలుకు మూడు రెట్లు అధికంగా చెల్లించా.వడ్డీ వ్యాపారుల ఆగడా లతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. అధికారులు స్పందించి వడ్డీ వ్యాపారుల ఆగడాలపై చర్యలు తీసుకోవాలి.