Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రూ. 40 కోట్లకు రింగ్
పంచాయతీరాజ్ శాఖలో పంపకాలు . . ?
నవతెలంగాణ-మిర్యాలగూడ
వడ్డించేవాడు మనవాడైతే కడబంతిలో ఉన్నా వడ్డిస్తాడన్న చందంగా . . పీఎంజీఎస్వై నిధులు సుమారు రూ. 40 కోట్ల టెండర్లు ఒకే ఒక్కడికి వచ్చే విధంగా ప్రజాప్రతినిధులు పావులు కదిపారు. నాగార్జునసాగర్, దేవరకొండ , నల్లగొండ నియోజకవర్గాల్లో ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన కింద వివిధ ప్యాకేజీల్లో రూ.40 కోట్లకు పంచాయతీరాజ్ శాఖ ద్వారా టెండర్లు పిలిచారు.ఈనెల 5న టెండర్ల గడువు ముగిసింది.అర్హత సర్టిఫికెట్ ఒక్కరికే ఇచ్చి మిగతా కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చి సింగిల్ టెండర్ అమలు చేశారు. హాట్ మిక్స్ ప్లాంట్ ఉన్న కాంట్రాక్టర్లు అర్హులు. 70 కిలోమీటర్లలోపు ప్లాంట్ ఉన్న కాంట్రాక్టర్లు అర్హులు కానీ అర్హత సర్టిఫికెట్ మాత్రం ఒక్కరికే ఇచ్చి టెండర్లలో మిగతా వారిని పాల్గొనకుండా చేశారు.ఈ టెండర్లలో అదనపుధర కోడ్ చేసే అవకాశం ఉన్నందున ఒక్కడికే వచ్చేవిధంగా పర్సంటేజ్లు మాట్లాడుకున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.మూడు నియోజకవర్గాల్లోపనులకు రూ.5 కోట్లు చేతులు మారినట్టు సమాచారం.అన్ని అర్హతలు ఉన్న డిస్టెన్స్ సర్టిఫికెట్ ఇవ్వడంలో అధికారులు అలసత్వం చేశారని కొందరు కాంట్రాక్టర్లు విమర్శిస్తున్నారు. కొందరు కాంట్రాక్టర్లు టెండర్లు రద్దు చేసి మళ్ళీ టెండర్ పిలవాలని కోర్టును ఆశ్రయిస్తున్నట్టు సమాచారం.
పనులకు టెండర్లు పిలువాలి
క్లాస్ 1 కాంట్రాక్టర్ అంకతి సత్యం
ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద మంజూరైన పనుల్లో టెండరింగ్ గోల్మాల్ జరిగింది..అర్హత కలిగిన కాంట్రాక్టర్లు అందరూ టెండర్లో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఉండి అర్హత లేని వారికి ఒక్కరికి మాత్రమే టెండర్ దరఖాస్తును అందించారు.గట్టిగా నిలదీసిన కాంట్రాక్టర్లకు గడువు ముగిసే గంటముందు దరఖాస్తుఫారాలను వాట్సాప్లో పంపించారు. సమయం కొద్దిగా ఉండడం వల్ల కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయలేకపోయారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న రోడ్ల పనులకు ఎమ్మెల్యే సూచించిన ఒక వ్యక్తికి టెండర్ దాఖలు చేసుకునే అనుమతి ఇచ్చారు. టెండర్నుపారదర్శకంగా జరగకపోవడంతో వెంటనే దీన్ని రద్దు చేసి ఇ టెండర్ పిలవాలి.కాంట్రాక్టర్లంతా హాజరయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి.