Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధాన్యాన్ని ఇరు ప్రభుత్వాలు కొనాల్సిందే
దొంగ నాటకాలు మాని రైతులను ఆదుకోవాలి
రైతు సంఘం
రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పూటకో మాట మాట్లాడుతూ అపరిచితుడి పాత్ర పోషిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. శనివారం ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ రైతుల సమస్యను పక్కదోవ పట్టిస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ ద్వారా దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ధాన్యం అమ్ముకునేందుకు రైతులు నెలరోజులుగా ఐకెపి కేంద్రాల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరిన కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మోడీ కాళ్ళు మొక్కి ఆ చట్టాల విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని విమర్శించారు ఇప్పుడు ధాన్యం కొనుగోలు, వరి సాగు విషయంలో ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థంకాని పరిస్థితి ఉందన్నారు. వరి సాగు చేస్తే ఊరేనని చెప్పే ప్రభుత్వాలకు రైతులు ఉరి తీస్తారని హెచ్చరించారు. యాసంగిలో వేరే పంటలు వేసుకోమని ప్రభుత్వాలు సూచించడం సరికాదన్నారు. ఇక్కడి భూముల్లో కేవలం వరి సాగు మాత్రమే అవుతుందని, అందుకే రైతులు వరి సాగు చేస్తారని పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మిల్లర్లు సమన్వయంగా ఉంటూ వరి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు నూకల జగదీష్ చంద్ర, రవి నాయక్, డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, వేములపల్లి వైస్ ఎంపీపీ గోవర్ధని, పాదురి శశిధర్రెడ్డి, భవాండ్ల పాండు, పరుశు రాములు, రాంచంద్రు, బాబునాయక్, పాతని శ్రీను, నాగేశ్వరరావు పాల్గొన్నారు.