Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తూతూమంత్రంగా నల్లగొండ జెడ్పీ సమావేశం...!
గైర్హాజరైన కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు
పత్తాలేని ఎంపీలు, ఎమ్మెల్యేలు
నవతెలంగాణ - నల్లగొండ
ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించాల్సిన జెడ్పీ సమావేశాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు టేకిటీజీగా తీసుకుంటున్నారు. కొందరు ఇలా..వచ్చి అలా వెళ్తుండగా మరి కొందరు..ఏకంగా సమావేశాలకే డుమ్మా కొడుతున్నారు. సాదాసీదాగా సమావేశం జరిగితే ప్రజా సమస్యలు వినేదెవరు..పరిష్కరించేదెవరని స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా శనివారం జరిగిన నల్లగొండ జెడ్పీ సర్వసభ్య సమావేశమే దీనికి మంచి ఉదాహరణగా చెప్పొచ్చు. సమావేశం జరిగిన తీరు చూస్తే..కేవలం మూడు గంటల్లోపే..ఐదు అంశాలను చర్చించి మమ అనిపించారు.
నల్లగొండ జెడ్పీ సమావేశం శనివారం చైర్మెన్ బండ నరేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరు కాలేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు కూడా రాలేదు. దీంతో సమావేశం సాదా సీదాగా సాగింది. 18 ఎజెండా అంశాలు చర్చించకుండానే సమావేశాన్ని మూడు గంటల్లో ఐదు అంశాలతో అర్ధాంతరంగా ముగించేశారు.
నల్లగొండ మండలంలోని నర్సింగ్‌బట్ల గ్రామంలో గతంలో ఐకేపీ కేంద్రాన్ని సబ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేశారు. రైతులు గతంలో లాగానే అదే జాగాలో 100 కుప్పల ధాన్యాన్ని తీసుకొచ్చి వేశారు. ప్రస్తుతం అధికారులు ఆ కేంద్రాన్ని వేరే చోటికి మర్చారు. దీంతో ధాన్యం తెచ్చి వేసిన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులను ప్రశ్నిస్తే..వేసిన ధాన్యం తీసుకొచ్చి కొత్త చోటికి తీసుకుని రావాలని ఉచిత సలహాలు ఇస్తున్నారని నల్లగొండ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. నాంపల్లి జెడ్పీటీసీ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తమ మండలంలో ఇంత వరకూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదన్నారు. గతంలో కొనుగోలు చేసిన ధాన్యంలో అవకతవకలు జరిగాయని, దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, అవకతవకలకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు.
తిప్పర్తి జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి మాట్లాడుతూ జిల్లా సర్వసభ్య సమావేశానికి మంత్రి వస్తేనే, కలెక్టర్ వస్తారా అని, అదే విధంగా జిల్లా అధికారులు కూడా రావడం లేదన్నారు. సమావేశానికి కలెక్టర్ హాజరయ్యేలా చూడాలని కోరారు. దేవరకొండ జెడ్పీటీసీ దేవేందర్ మాట్లాడుతూ దేవరకొండ మండలంలో లైన్మెన్ మద్యం సేవించి సబ్‌స్టేషన్‌కు వెళ్లి సర్పంచులను దుర్భాషాలాడని, అందుకు సాక్షాలు ఉన్నాయని, ఆయన్ను వెంటనే సస్పెండ్ చేయాలని, లేని పక్షంలో తాను రాజీనామా చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి, డిప్యూటీ సీఈవో కాంతమ్మ, వైస్ చైర్మెన్ పెద్దులు, వివిధ మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.
వ్యవసాయ రంగానికి ఆదుకున్నది కేసీఆర్
: ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి
వ్యవసాయ రంగాన్ని పూర్తి స్థాయిలో ఆదుకున్నది సీఎం కేసీఆర్. అందుకే రాష్ట్రంలో వరి సాగు పెరిగింది. 2020- 21లో తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా వరిసాగులో మొదటి స్థానంలో నిలిచింది. కేవలం నల్లగొండ జిల్లాలో సేంద్రియ వ్యవసాయం నడుస్తుంది.
వరిని కేంద్రం కొనుగోలు చేయాలని తీర్మానం చేయాలి
: బడుగుల లింగయ్య యాదవ్ - రాజ్యసభ సభ్యులు
యాసంగి వరిని కేంద్రమే కొనుగోలు చేసేలా సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయాలి. జిల్లా సర్వసభ్య సమావేశానికి జిల్లా ఉన్నతాధికారులు హాజరు కాకపోవడం విచారకరం. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులు గ్రామాల సమస్యలు ఎవరితో చెప్పుకోవాలో అర్ధం కాని పరిస్థితి ఉంది.జిల్లాల్లో ఆగిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు వెంటనే ప్రారంభించాలి.
అధికారులు, ప్రజాప్రతినిధులను ఇబ్బంది పెడితే
సహించేది లేదు.
బండ నరేందర్ రెడ్డి - చైర్మెన్
ప్రజాప్రతినిధుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. వారిని ఇబ్బంది పెడితే సహించేది లేదు. దేవరకొండలో నేషనల్ ప్రోగ్రాం ఉన్నందున జిల్లా కలెక్టర్, ఉన్నత అధికారులు సమావేశానికి రాలేదు. నర్సింగ్‌బట్ల గ్రామంలో సబ్ స్టేషన్ వద్ద రైతులు ఏర్పాటుచేసిన వరి రాశులకు లారీల సాయంతో పంపించే ఏర్పాట్లు చేయాలి. ఈ మేరకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి.