Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండూర్: సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా 20వ మహా సభల్లో ప్రణాళిక రూపొందిం చుకొని పేద ప్రజల సమస్యల కోసం భవిష్యత్తులో పోరాటాలు సాగిస్తామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 17, 18, 19 తేదీల్లో నల్లగొండ పట్టణంలో 20 వ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ మహాసభల్లో రాబోవు నాలుగు సంవత్సరాల ఉద్యమాల ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగుతోందన్నారు. ఎస్ఎల్ బీసీ, డిండి ఎత్తిపోతల, ఉదయ సముద్రం పనులు పూర్తి చేయాలంటూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం దళితులకు 3 ఎకరాలు, పేద ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను అందజేయాలని భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. నల్లగొండ పట్టణ కేంద్రంలో డ్రైనేజ్, రోడ్లు, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఉద్యమాలు చేశామని తెలిపారు. నేర్మట గ్రామంలో బెండలమ్మ చెరువు పనులను పూర్తిచేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలం లోని రైతు బంధు చెక్కులు మాయంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి మల్లేశం, మండల కార్యదర్శి బొట్టు శివ కుమార్, కల్లుగీత కార్మిక సంఘం మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజరు గౌడ్, మండల కమిటీ సభ్యులు కుక్కునూరు నాగేష్ తదితరులు పాల్గొన్నారు.