Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మలవీరారెడ్డి
నవతెలంగాణ-హాలియా
ఆరు కాలం కష్టపడి పంట పండించిన రైతన్నలకు ధాన్యం కొనుగోలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని, దీంతో రైతులు దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వీరారెడ్డి విమర్శించారు.హాలియాలో జరిగిన సీపీఐ(ఎం) ఏడో మండల మహాసభకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకువచ్చిరైతులను నట్టేట ముంచుతున్న కేంద్రానికి అడుగులకు మడుగులొత్తుతూ ఆ చట్టా లను సపోర్ట్ చేస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి మళ్లీ కేంద్రంపై ధర్నాలు అంటూ కపట నాటకాలు ఆడుతూ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రైతులు పండించిన పత్తి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. హాలియా మండల పరిధిలో సగ భాగం వరి, సగభాగం పత్తి పంటలు సాగు చేస్తున్నారని, వెంటనే మార్కెట్ ఓపెన్ చేసి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. అలాగే సీసీఐ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.మహాసభలో నాలు గేండ్లలో జరిగిన కార్యక్రమాలను నెమరు వేసుకుంటూ పలు అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టారు. మున్సిపాలిటీలో ఉపాధిపనికి లేక పోవడం వలన కూలీలు ఇబ్బంది పడుతున్నారని, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, హాలియాలో 48 సర్వేనెంబర్లో వందలాది మంది నివసిస్తున్న వారికి ఇండ్ల పట్టాలు మంజూరు చేయాలని, రోడ్డు, కరెంట్ సౌకర్యం కల్పించాలని, మండల పరిధిలో 20 ఏండ్లుగా ఇండ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూమిని వెంటనే పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి డబుల్ బెడ్ రూమ్ వర్తింపచేయాలని, 57 ఏండ్లు నిండిన అందరికీ పెన్షన్స్ మంజూరు చేయాలని, అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని, దళిత బంధు, బీసీ బంధు, ఎస్పీ బంధు, మైనారిటీ బంధు, అగ్రవర్ణ పేదల బంధును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హాలియా మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలని పలు అంశాలపై 8 తీర్మానాలు ప్రవేశపెట్టారు. అనంతరం 10 మంది సభ్యులు ఒక కోఆప్షన్తో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కూన్‌రెడ్డి నాగిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు చినపాక లక్ష్మీనారాయణ, అవుతా సైదులు, కొండేటి శ్రీను, సమావేశ అధ్యక్షులు కత్తి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు నామ సత్య నారాయణ,పొదిలి వెంకన్న, కారంపూడి ధనమ్మ, నాగేంద్రమ్మ, ఆవుల రామ్ రెడ్డి, కర్ణ వెంకారెడ్డి, లక్ష్మీ, అశోక్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆకారపు నరేష్, పాండు, రమేష్ పాల్గొన్నారు.