Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి
మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ - సూర్యాపేట
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు చేపట్టింది రైతు భరోసా యాత్ర కాదని, రైతు భక్షణ యాత్ర అని సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నర్సింహారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల మనుగడకు తీరని నష్టం కలిగించే విధానాలను అనుసరిస్తున్న బీజేపీ రైతులకు ఏ విధంగా భరోసా కల్పిస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు పండించిన వరి పంటను కొనుగోలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఏ ముఖం పెట్టుకుని ఐకెపి కేంద్రాలను సందర్శిస్తున్నారని ప్రశ్నించారు. రైతులు పండించిన ధాన్యాన్ని మొత్తం ఎఫ్సిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం ఐకేపీ ద్వారా కొనుగోలు చేసే వరి ధాన్యాన్ని పాడీక్లీనర్ ద్వారా జరపాలనే ఆలోచన సరికాదని, దీనివల్ల రైతుల వరి ధాన్యం కొనుగోలులో ఆలస్యం జరిగే ప్రమాదం ఉందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్లు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేస్తూ రైతు ప్రయోజనాలకు తీరని నష్టం కలిగిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కమిటీ సభ్యులు మట్టిపెల్లి సైదులు, ఎల్గూరి గోవింద్, కోట గోపి, జిల్లపల్లి నర్సింహారావు, చెరుకు ఏకలక్ష్మి, నాయకులు చిన్నపంగ నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.