Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇబ్బందులు పడుతున్న జనం
నవతెలంగాణ-నల్లగొండ
కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరుగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు బ్బందులు పడుతున్నారు.గతంలో కిలోకు వెచ్చించిన ధరతో ఇప్పుడు కనీసం పావు కిలో రావడం లేదని ప్రజలు వాపోతున్నారు. జిల్లాలో ప్రధానంగా మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, నల్లగొండ, మున్సిపాలిటీలతో పాటు జిల్లావ్యాప్తంగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. మార్కెట్లోకి వెళ్లాలంటే జనం భయపడే పరిస్థితి ఏర్పడింది.టమాట, ఉల్లిగడ్డ, పచ్చి మిర్చి, చిక్కుడు, వంకాయ, పాలకూర, దొండకాయ ఇతర అన్ని రకాల కూరగాయల ధరలు పెరిగాయి.నిన్న మొన్నటి వరకు కిలో టమాట రూ.30 నుంచి రూ. 40 వరకు ఉండగా మూడు రోజులుగా కిలో వంద రూపాయలు పలుకుతోంది. చిక్కుడు రూ.80, వంకాయ రూ.60, బెండకాయ రూ. 50, పచ్చిమిర్చి రూ. 60, బీరకాయ రూ.80, బెండకాయ రూ.70, క్యారెట్ రూ.90, దొండకాయ రూ.80, ఉల్లిగడ్డ రూ.50, పలుకుతున్నాయి.వీటితో పాటు పలు రకాల కాయగూరలు, ఆకుకూరల ధరలు సైతం పెరిగాయి.వారం, పది రోజులుగా కూర గాయల ధరలు విపరీతంగా పెరగడంతో సామన్య ప్రజలు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
దెబ్బతిన్న పంటలు....
కూరగాయల ధరలు భారీగా పెరగడానికి కారణం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలే అని రైతులు అంటున్నారు.వర్షాకాలంలో జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వేల ఎకరాల్లో వివిధ కూరగాయల పంటలు సాగు చేయగా ఇటీవల కురిసిన వర్షాలకు సుమారు 75 వర్షాలు శాతం దెబ్బతిన్నాయి.ఫలితంగా ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను రవాణా చేసుకోవడంతో ధరలు అధికంగా ఉంటున్నాయి. అంతేగాకుండా రైతులు పండించిన కూరగాయలను మార్కెట్లో విక్రయించకుండా మధ్య దళారులకు రైతులు విక్రయిస్తున్నారు.వ్యాపారులు నిర్ణయించిన ధరలకే కొనుగోలు చేయాల్సి వస్తోంది. యాసంగి సీజన్లో మరో వెయ్యి ఎకరాల్లో వివిధ కూరగాయల పంటలను సాగు చేస్తున్నారు.ఈ పంటలు చేతికి రావడానికి మరో 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది కొత్తగా సాగు చేసిన పంటలు చేతికందితే తప్ప కూరగాయలు ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు.