Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గౌరవం పెంచేలా ఉండాలి
ప్రతి వాహనాన్నీ సొంత వాహనం మాదిరిగా చూసుకోవాలి
వాహన నిర్వహణ సరిగా చూసుకునే
డ్రైవర్లకు రివార్డులు
అదనపు ఎస్పీ నర్మద
నవతెలంగాణ-నల్లగొండ
పోలీస్ శాఖ గౌరవం, ప్రతిష్ట పెంచే విధంగా పోలీసుల వాహనాల నిర్వహణ ఉండేలా డ్రైవర్లు మరింత క్రమశిక్షణతో విధి నిర్వహణ చేయాలని అదనపు ఎస్పీ నర్మద అన్నారు.సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎంటీ విభాగం ఆర్ఐశ్రీనివాస్ నేత త్వంలో పోలీస్ వాహనాల డ్రైవర్లకు అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ రిచర్డ్ సన్ శిక్షణ ఇచ్చారు.అనంతరం నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ డ్రైవర్లలంతా లైసెన్స్ కలిగి ఉండాలని, పోలీస్ శాఖ గౌరవం మీ చేతుల్లో ఉందనే విషయం గుర్తుంచుకుని, క్రమశిక్షణతో విధి నిర్వహణ చేస్తూ వాహనాల నిర్వహణ సక్రమంగా చేయాలని సూచించారు.అతివేగంతో వెళ్లకూడదని, ప్రతి ఒక్కరూ వాహనాన్ని తమ స్వంత వాహనం లాగా చూసుకుంటూ శుభ్రంగా పోలీస్ శాఖ క్రమశిక్షణ ప్రతిబింబించేలా చూడాలన్నారు.ఘటనా స్థలానికి వెళ్లే సమయంలో, ఎస్కార్ట్, నేర పరిశోధన ప్రాంతాలకు వెళ్లే సమయంలోనూ వాహన సామర్ధ్యానికి అనుగుణంగా వాహనాలను నడపాలన్నారు.నిర్దేశించిన వేగం మించకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.ప్రతి ఒక్కరూ వాహనం నడిపే సమయంలో తమ కుటుంబం, జీవితం గురించి ఆలోచించి వాహనాలను క్రమపద్ధతిలో నడపాలని సూచించారు.అదే సమయంలో వాహన నిర్వహణ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని, చిన్న చిన్న మరమ్మతులు ఉంటే వెంటనే చేయించి వాహనం సరిగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు.పోలీస్ స్టేషన్ల వారీగా వాహనాలను ఎంటీ ఆర్ఐ పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వాహనాల నిర్వహణ సక్రమంగా ఉండే వారిని గుర్తించి వారికి రివార్డులు ఇచ్చి ప్రోత్సహించడంతో పాటు, నిర్వహణ సరిగా లేని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ రిచర్డ్సన్ మాట్లాడుతూ వాహనాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, వాహనం లోపల, బయట పరిశుభ్రమైన వాతావరణం ఉండే విధంగా చూసుకోవాలన్నారు.ట్రాఫిక్ నిబంధనలు, వేగ పరిమితి, ఇతర నిబంధనల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. హైవేల మీద ప్రయాణం చేసే సమయంలో 80 కిలోమీటర్ల వేగం విధిగా పాటించాలని, వాహనాల ఇంజన్ ఆయిల్, బ్రేక్, క్లచ్ అయిల్స్, కూలెంట్ అయిల్స్ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, సమయానికి అనుగుణంగా ఆయిల్ మార్పు చేసుకుంటూ టైర్లలో గాలి సక్రమంగా ఉండేలా చూడాలని, స్పీడ్ బ్రేకర్ల వద్ద వాహనాల వేగాన్ని తగ్గించి వాహనాల జీవితకాలాన్ని పెంచేలా చూసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సురేష్కుమార్, ఎంటీ విభాగం శ్రీనివాస్, ఎంటీ విభాగం సిబ్బంది లియాఖత్, ఖాశీం పాల్గొన్నారు.
.