Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేటకలెక్టరేట్
వ్యవసాయ కార్మికుల పరిరక్షణ కోసం సమగ్ర వ్యవసాయ కార్మిక చట్టం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనంజయనాయుడు ప్రభుత్వానికి కోరారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి మాట్లాడారు. ప్రస్తుతం అమల్లో ఉన్న భూ సీలింగ్ చట్టాన్ని రద్దు చేసి, కమతానికి పదెకరాల నుంచి 15 ఎకరాల వరకు భూ పరిమితి చట్టాలు చేసి, మిగులు భూమిని సమీకరించి భూమి లేని వ్యవసాయ కార్మికులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాలో పోడు భూముల రైతులందరికీ అటవీ హక్కు చట్టం ద్వారా హక్కు పత్రాలు ఇవ్వాలని, అందరికీ రైతు బంధు, రైతు బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. 55 ఏండ్లు నిండిన వ్యవసాయ కార్మికులకు ప్రతి నెలా రూ.5000 చొప్పున పెన్షన్ ఇవ్వాలన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలను గుర్తించి వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు రెమిడాల రాజు, ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు దంతాల రాంబాబు, ఏఐవైఎఫ్ జిల్లా కోశాధికారి చిలకరాజు శ్రీను, తలకప్పల సుధాకర్, ఏఐఎస్ఎఫ్ నాయకుడు రెడ్డిమల్ల వినరు, జడ వెంకన్న, సైదులు, రెమిడాల నాగేష్, వెంకటేష్ పాల్గొన్నారు