Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ - భువనగిరిరూరల్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన 1996 కేంద్ర చట్టం, 1998 సెస్స్, 1979 అంతర్రాష్ట్ర వలస కార్మికుల రక్షణ చట్టాలను వెంటనే పునరుద్ధరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు డిమాండ్ చేశారు. దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీడబ్ల్యూయూ) జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టాల రద్దుతో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్ బోర్డులు రద్దు కానున్నాయన్నారు. బోర్డు ద్వారా అనేక సంక్షేమ పథకాలు ఇప్పటి వరకూ అమలవుతున్నాయని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టాలను రద్దు చేసి వాటిని లేబర్ కోడుల్లో కలపడం వల్ల భవన నిర్మాణ కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరగనున్నట్టు తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల రక్షణ కోసం రూపొందించిన చట్టాలను కాపాడుకోవడానికే ఈ సమ్మె చేపట్టినట్టు తెలిపారు. కరోనాతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అనేక మంది ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారన్నారు. అనేక రాష్ట్రాల్లో ఈ వెల్ఫేర్ బోర్డుల ద్వారా కరోనా ఆర్థిక సహకారం అందించినప్పటికీ తెలంగాణ వెల్ఫేర్ బోర్డు ద్వారా రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణానికి వినియోగించే మెటీరియల్ ధరలను పెంచడం వల్ల పనుల్లే అనేక మంది కార్మికుల కుటుంబాలు పూట గడవని పరిస్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రం వాలా రూ.450 కోట్లను వెంటనే తెలంగాణ వెల్ఫేర్ బోర్డులో జమ చేయాలని కోరారు. కార్మిక శాఖ కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు డీసీఎల్, ఏసీఎల్ పోస్టులను మంజూరు చేయాలని, భువనగిరి, రామన్నపేట ఏఎల్వో ఆఫీసుల్లో రెగ్యులర్ ఏఎల్వోలను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీడబ్ల్యూయూ జిల్లా ఉపాధ్యక్షులు రాధారపు మల్లేశం, కొంగరి మారయ్య, అరూరి నర్సింహా, జిల్లా సహాయ కార్యదర్శులు కూరెళ్ల నర్సింహ, గాదె కృష్ణ, మొగిలిపాక నర్సింహా, నాయకులు మల్ల కుమార్, రాము, బాబు, శింగారం వెంకటేశం, వెంకన , ఇక్కుర్తి స్వామి, బెజాడి శ్రీశైలం, పబ్బల రాజు, సంజీవ, ఎస్కె శ్రీను, యాదగిరి, సత్తయ్య పాల్గొన్నారు.