Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు
నవతెలంగాణ - సూర్యాపేటకలెక్టరేట్
భవన నిర్మాణ కార్మికులు చేపట్టిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగా సాధించుకున్న 1996 భవన ఇతర నిర్మాణ కార్మికుల కేంద్ర సమగ్ర చట్టం, 1979 వలస కార్మికుల చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల దేశవ్యాప్త సమ్మె సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి భవననిర్మాణ కార్మికులకు రక్షణ కవచంగా ఉన్న వెల్ఫేర్ బోర్డును, వలస కార్మికుల చట్టాలను రద్దు చేసి కార్మికులకు ద్రోహం చేసిందని విమర్శించారు. కార్మికుల సంక్షేమ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. నిర్మాణరంగంలో వాడే ముడి సరుకుల ధరలు తగ్గించాలని, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న క్లైంలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా దారి మళ్లించిన రూ.1005 కోట్లను తిరిగి బోర్డులో జమ చేయాలని కోరారు. 55 ఏండ్లు నిండిన కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని, ప్రమాదంలో చనిపోతే రూ.10 లక్షలు ఇవ్వాలని, సహజ మరణానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. అనంతరం ఏవో శ్రీదేవికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భవననిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రావులపెంట వెంకయ్య, జిల్లా సహాయ కార్యదర్శి అనంతుల మల్లయ్య, కూర జాహాంగీరు, గంటవెంకటేశ్వర్లు, ఏనుగుల గణేష్, వల్లంపట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.