Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ - భువనగిరి/భూదాన్‌పోచంపల్లి
అనేక రైతాంగ పోరాటాలకు గడ్డ భువనగిరి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ అన్నారు. ఆ పార్టీ యాదాద్రిభువనగిరి జిల్లా ద్వితీయ మహాసభల సందర్భంగా మొదటి రోజు ఆదివారం భూదాన్‌పోచంపల్లి మండలకేంద్రంలోని బాలాజీ ఫంక్షన్హాల్లో మండల కార్యదర్శి పగిళ్ల లింగారెడ్డి అధ్యక్షతన వ్యవసాయ రంగ సంస్కరణలపై నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రబుత్వం మార్కెట్ వ్యవస్థను ప్రైవేటు రంగానికి బడా కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పాలని చూస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.. వ్యవసాయాన్ని సంక్షోభం దిశగా నెట్టి రైతులు భూములు అమ్ముకునే విధంగా చేస్తున్నాయన్నారు. రైతుల భూములను అప్పనంగా కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడానికి కేంద్రం మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చిందన్నారు. రైతులు చేసిన పోరాటం వల్ల వాటిని రద్దుచేసినట్టు ప్రకటించిందన్నారు. మార్కెట్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్రలు పన్నుతోందన్నారు.. ధాన్యం, కూరగాయల కొనుగోలు కేంద్రాలు, పాల ఉత్పత్తి కేంద్రం, చేపల, పండ్ల మార్కెట్ లేక ఇక్కడ రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ధాన్యము,పత్తి, కూరగాయలు, పండ్లు, చెపలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ సీఎం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, పేద ప్రజలకు డబుల్ బెడ్ ఇండ్లు ఇవ్వాలని భారీ ఎత్తున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చిన ఘనత కమ్యూనిస్టు లేదన్నారు. జిల్లాలో రోడ్లు మౌలిక వసతులు ఇతర సమస్యలను పరిష్కరించాలని మహాజన పాదయాత్రలో ఉద్యమాలు చేశామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలన్నారు. ఉద్యమాల ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
సీపీఐ(ఎం) పోరాటాల ఫలితంగానే వ్యవసాయ రంగం అభివద్ధి
రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ
యాదాద్రి భువనగిరి జిల్లాలో సీపీఐ(ఎం) చేసిన పోరాట ఫలితంగానే వ్యవసాయ రంగం అభివద్ధి చెందుతోందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ తెలిపారు. కర్నూలు జిల్లా అయిన యాదాద్రి భువనగిరి జిల్లాకు భారీ చిన్న నీటి వనరుల నీటి సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశామన్నారు. అనేక రైతాంగ పోరాటాలు చేశామన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం మూసీ ఆధారంగా పిల్లాయిపల్లి బునాదిగాని, ధర్మారెడ్డి కాల్వలకు శ్రీకారం చుట్టిందన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో వ్యవసాయం పెరిగిందన్నారు. 80 శాతం రైతులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. నేడు ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన చేశారు. మూసీ కాలుష్యాన్ని అరికట్టాలన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి కారణమని పేర్కొన్నారు. మూసీ పరీవాహక ప్రాంతం సీపీఐ(ఎం) చేసినపోరాటాల వల్ల వచ్చిన నీటి వనరులతో కోనసీమ మాదిరిగా వ్యవసాయం పచ్చదనం పెరిగిందన్నారు. వ్యవసాయం కాపాడుకోవడానికి రైతులు అనుబంధగా ఉన్న వ్యవసాయ కార్మికులు వత్తిదారులు ఐక్య ఉద్యమాల్లో పాల్గొనాలని కోరారు. ప్రపంచ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన పోచంపల్లిలో చేనేత పరిశ్రమను మరింత అభివద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
కమ్యూనిజం అనివార్యం.
సీనియర్ న్యాయవాది కొత్త బుచ్చిరెడ్డి
దేశానికి కమ్యూనిజం అనివార్యమని ప్రజలు అందుకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు న్యాయవాది కొత్త బుచ్చిరెడ్డి తెలిపారు. సోమవారం భూదాన్ పోచంపల్లిలో సీపీఐ(ఎం) జిల్లా మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ రంగం సంస్కరణలపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కమ్యూనిస్టు అంటే శాస్త్రీయ విప్లవ దక్పథం ఉన్న వాళ్లని తెలిపారు. కారల్ మార్క్స్, లెనిన్, ఎంగిల్స్ తదితరులు ప్రజల జీవన స్థితి మెరుగు పడడానికి సిద్ధాంతాలను రూపకల్పన చేశారన్నారు. వాటిని ప్రజలు అనుసరించి సమాజంలో దేశంలో మార్పు తీసుకురావడానికి కషి చేయాలన్నారు. పోచంపల్లి గ్రామం మొదట గాజులరామారంగా ఉండేదన్నారు. ఇక్కడ గాజుల పరిశ్రమ కుటీర పరిశ్రమగా అభివద్ధి చెందిందన్నారు. కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గించడానికి, వారిని అణిచి వేయడానికి ఈ గ్రామంలోనే భూదాన్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు ఉంటేనే కమ్యూనిస్టులు ఉన్నట్టు కాదని అది కొందరి భ్రమ అని పేర్కొన్నారు. రాజకీయాలలో సమాజంలో డబ్బులు ఎప్పటికీ ప్రాబల్యం చూపవలేనని పేర్కొన్నారు. ప్రజలకు ఎరగా వేసి కొన్ని సంస్కరణలతో పూర్తిగా ప్రజల అభివద్ధి చెందలేరని పేర్కొన్నారు. నల్ల డబ్బు బాగా పెరిగి పోయిందని తెలిపారు. ప్రస్తుతం రియల్ఎస్టేట్ కారణంగా మరింత నల్లధనం పెరిగిపోయింది అన్నారు. కమ్యూనిస్టులకు వ్యవసాయ రంగం పైన అగ్రికల్చర్ సీలింగ్, అర్బన్ సీలింగ్ చట్టాలపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలి అన్నారు. చట్టానికి నేడు కార్పొరేట్ శక్తులు తూట్లు పొడుస్తున్నాయన్నారు. వాటిని గుర్తించి వెలికి తీసి ప్రజలకు వివరించాలన్నారు. ప్రజలు శాస్త్రీయ తో తమ జీవన స్థితిగతులు మెరుగుపరుచుకోవాలని తెలిపారు. దేశంలోని ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని రంగం కుదేలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకు పోతే ఆహారధన్యాల ధరలు పెరిగి దేశంలో ఆహార కొరత ఆర్థిక సంక్షోభాలు ఏర్పడతాయన్నారు. ఈ యొక్క మహాసభల్లో తీసుకున్న నిర్ణయాలు అమలు పరిచే విధంగా కషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఆహ్వాన సంఘం అధ్యక్షులు గూడూరు అంజి రెడ్డి ,రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, బట్టుపల్లి అనురాధ , కల్లూరి మల్లేశం, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు వేముల ఆనంద్, మున్సిపల్ పట్టణ కార్యదర్శి బాల్ నరసింహ డీివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గడ్డ వెంకటేశం, మండల కమిటీ సభ్యులు కోట రామచంద్ర రెడ్డి, ప్రసాదం విష్ణు, మంచాల మధు, శివ, జగన,్ అనిల్ రెడ్డి ,ఎస్ఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.