Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాదాద్రిభువనగిరి కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరి రూరల్
ఆరుతడి పంటలపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని హనుమాపూర్, తుర్కపల్లి మండలం రుస్తాపూర్ గ్రామాలలో రైతులకు నిర్వహించిన అవగాహనా కార్యక్రమాల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. వచ్చే యాసంగిలో ధాన్యాన్ని ఎఫ్సీఐ కొనుగోలు చేయడంలేదని, రైతులు ఇతర పంటలపై అవగాహన పెంచుకొని ఆదాయం పొందాలని సూచించారు. రైతులు ఆరుతడి పంటలైన వేరుశనగ, శనగ, ఆవాలు, నువ్వులు, కుసుమలు, ఆముదం, పెసర, పొద్దు తిరుగుడు, మినుములు, జొన్న, తదితరు పంటలు సాగు చేయాలని, 90 రోజుల నుండి 120 రోజుల లోపల ఆరుతడి పంటలు చేతికి వస్తాయన్నారు. వరి పంట కంటే ఎక్కువ నికర ఆదాయం వస్తుందన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాలలో ప్రతిరోజూ మూడు నాలుగు చిన్న చిన్న రైతు సమూహాలు ఏర్పాటు చేసి ప్రతి రైతుకు ఆరుతడి పంటలపై సూచనలు, సలహాలు అందించాలన్నారు. హనుమాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా చేపట్టాలని, ట్యూబ్ ఎంట్రీ వెంటనే నిర్వహించాలని, రైతుల ఖాతాల్లో డబ్బులు సకాలంలో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, వ్యవసాయ అధికారులు వెంకటేశ్వర్ రెడ్డి, దుర్గేశ్వర్, పౌరసరఫరాల అధికారులు పాల్గొన్నారు.