Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ హాజరైన రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి
అ జెండావిష్కరించిన సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి
అ అమరవీరులకు నివాళులు
నవతెలంగాణ - నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి/భూదాన్‌పోచంపల్లి
పర్యాటక ప్రాంతమైన భూదాన్‌పోచంపల్లిలో నిర్వహించిన సీపీఐ(ఎం) యాదాద్రిభువనగిరి జిల్లా 2వ మహాసభలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మహాసభల ప్రారంభానికి ముందు పార్టీ జెండాను సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పలువురు అమరవీరులకు నివాళులర్పించారు. మహాసభలో సంతాప తీర్మానాన్ని పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రవేశ పెట్టారు. ఈ మహాసభలను పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. భూమిని నమ్ముకొని జీవిస్తున్న రైతులను దేశంలోని మోడీ ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోందన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్లచట్టాలను రద్దు చేయాలని యేడాది పాటు రైతులు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించారని తెలిపారు. పోరాటాలకు దిగొచ్చిన ప్రభుత్వం నల్లచట్టాలను రద్దు చేసిందని తెలిపారు. ఇది ముమ్మాటికీ రైతుల విజయమేనన్నారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయకుండా సీఎం కేసీఆర్ కాలయాపన చేస్తూ కేంద్రంపై నెడుతున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ ఎందుకు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. పార్టీ నిర్మాణంలో క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న శాఖలే ముఖ్యమన్నారు. అనంతరం జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్ కార్యదర్శి నివేదికను ప్రవేశ పెట్టారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా మాట్లాడుతూ చిన్న నీటి వనరుల ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు
ఆకట్టుకున్న కళారూపాలు
మహాసభల సందర్భంగా పీఎన్ఎం కళాకారులు నిర్వహించిన కళారూపాలు ఎంతో ఆకట్టుకున్నాయి. పార్టీ సీనియర్ నాయకులు వేముల మహేందర్‌పై పాడిన పాటలు కన్నీరు పెట్టించాయి. ఇవే కాకుండా పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన నాయకులను గుర్తు చేస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలకుల తీరును ఎండగడుతూ కళాకారులు పాటలు పాడారు. సాయంత్రం వేళ మహాసభల ప్రాంగణంలో వీర తెలంగాణ వీధి నాటకాన్ని కళాకారులు ప్రదర్శించారు.
సభలకు డెలిగేట్‌గా హాజరైన దంపతులు
పార్టీ జిల్లా రెండో మహాసభలకు హాజరైన వారిలో సుమారు 10 మంది దంపతులు హాజరు కావడం విశేషం. మరో 10 మంది వరకు అన్నదమ్ములు కూడా ఉన్నారు.