Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) యాదాద్రి జిల్లా కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ -భూదాన్‌పోచంపల్లి
జిల్లా వ్యాప్తంగా ప్రజలు అందిస్తున్న మద్దతుతోనే నాలుగేండ్లలో పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహించామని సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని బాలాజీ ఫంక్షన్హాల్లో నిర్వహించిన ఆ పార్టీ జిల్లా ద్వితీయ మహాసభలో ఆయన మాట్లాడారు. నూతనంగా జిల్లా ఏర్పడి ఐదేండ్లు దాటినా సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్నారు. విద్య ,వైద్యం పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. కరోనా కష్టకాలంలో సరైన వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య పాదయాత్రకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించిందన్నారు. ఆ యాత్రలో ప్రజలు స్థానికంగా ఉన్న సమస్యలను లిఖితపూర్వకంగా తమకు అందించారని తెలిపారు .వాటి ఆధారంగా జిల్లా యంత్రాంగాన్ని కలిసి సమస్యలను పరిష్కరించాలని కోరినట్టు తెలిపారు. కానీ ఏ అధికారి కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదన్నారు .అధికార పార్టీ ఎమ్మెల్యేల చేతిలో అధికారులు కీలుబొమ్మలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సమస్యలు పరిష్కరించే వరకు తమ ఉద్యమం ఆగదన్నారు. ప్రజల పక్షాన ప్రజలతో కలిసి పనిచేస్తే ఆదరణతో పాటు పార్టీ బలపడుతుందని తెలిపారు. అందుకే గ్రామ శాఖ నుంచి జిల్లా శాఖ వరకు నిత్యం ప్రజలతో మమేకమై పోరాటాలు కొనసాగిస్తున్నామన్నారు. కార్మికుల సమస్యలు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలని మహా సభలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు.
పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
ఆహ్వాన సంఘం అధ్యక్షులు గూడూరు అంజిరెడ్డి
పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని ఆహ్వాన సంఘం అధ్యక్షులు గూడూరు అంజిరెడ్డి అన్నారు. సీపీఐ(ఎం) ద్వితీయ మహాసభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో గాంధీ వినోబాభావేను ఈ ప్రాంతాన్ని పంపారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణచివేయాలని ఉద్దేశంతోనే వినోబాభావే ఈ ప్రాంతానికి రావడంతో వెదిరె రామచంద్రారెడ్డి 100 ఎకరాలు దానం చేయడం వల్లనే భూదాన్‌పోచంపల్లికి పేరు వచ్చిందన్నారు. ఈ ప్రాంతా రైతాంగానికి సాగునీటి కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో 2006లో నాలుగు రోజులు పాటు 90రోజులు పాదయాత్ర చేపట్టి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతాంగ బాధలను వివరించారన్నారు. దాని ఫలితంగానే పిల్లాయిపల్లి కాలువ పనుల కోసం రూ.23 కోట్లా 52లక్షలు కాలువ పనులను ప్రారంభించిందన్నారు. పోచంపల్లి, చౌటుప్పల్, రామన్నపేట చిట్యాల మండలాల వరకు కాలువను పనులు చేపట్టారని తెలిపారు. పోచంపల్లి, రామన్నపేట, చౌటుప్పల్ మండలాల వరకు కొంత సాగునీరు అందినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందకపోవడంతో ఈ ప్రాంత భూములు బీడు భూములుగానే మిగిలిపోయాయని తెలిపారు. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి బునాదిగానే కాలువ మరమ్మతుల కోసం సుమారు రూ.300 కోట్ల కేటాయించి ఏండ్లు గడుస్తున్నా కాలువ పనులు అధికారులు, ప్రజా ప్రతినిధులే నిర్లక్ష్యం వల్లనే పూర్తికాలేదన్నారు. మూడుసార్లు క్రాప్ హాలిడే ద్వారా సుమారు ఈ ప్రాంత రైతాంగం రూ.300 కోట్లు నష్టపోయిందన్నారు. పరిశ్రమలు వచ్చాయి కానీ స్థానికులకు ఉద్యోగాలు రాలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ప్రజలపై భారాలు మోపిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధ్యాం కొనుగోలు విషయంలో నోరు మెదపడం లేదన్నారు భూమి లేని పేద రైతుల కోసం ,ఇల్లు లేని నిరుపేదల కోసం, కార్మికుల కర్షకుల కోసం నిరంతరం పోరాటాలు చేసి సమస్యలు పరిష్కరించడంలో సీపీఐ(ఎం) ఎనలేని కషి చేస్తోందన్నారు.
బస్వాపురం భూనిర్వాసితులకు నష్టపరిహారం అందించాలి
రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ
బస్వాపురం, గంధమల్ల ప్రాజెక్టులకు ప్రభుత్వం నిధులు కేటాయించి భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ కోరారు. సోమవారం జిల్లా రెండవ మహాసభలో ఆయన మాట్లాడుతూ పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగానే కాలువకు నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో పనులు చేపట్టాలని, జిల్లాలోని అన్ని మండలాల్లోనూ వందపడకల ఆస్పత్రులు ఏర్పాటు చేసి, 24గంటల వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. బీబీనగర్ ఎయిమ్స్‌కు నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో డిగ్రీ, పీజీ, బీటెక్, చౌటుప్పల్‌లో డిగ్రీ, పీజీ, బీటెక్ కాలేజీలను ఏర్పాటు చేసి విద్యనందించాలని కోరారు.
డిండి ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణపురం వరకు నీరు అందించాలని కోరారు. భూదాన్‌పోచంపల్లి మూసీ పర్యాటక ప్రాంతం కావడం వల్ల నీటి కాలుష్యంతో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. మూసీ నీటిని శుద్ధి చేసి సాగునీరందించాలని, పరిశ్రమల నుండి వెలువడుతున్న కాలుష్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. పర్యాటక కేంద్రాలైన పోచంపల్లి, కొలనుపాకకు నిధులు కేటాయించి అభివద్ధి చేయాలని కోరారు.
ఈ మహాసభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ,రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల్ల ఆశయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజుగౌడ్, మంగ నర్సింహులు, కల్లూరి మల్లేశం, దోనూరు నర్సిరెడ్డి , బట్టుపల్లి అనురాధ, పీఎన్ఎం రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దయ్యాల నర్సింహ, జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి, ఆహ్వాన ఆహ్వానసంఘం అధ్యక్షులు గూడూరు అంజి రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు దాసరి పాండు, కోమటిరెడ్డి చం ద్రారెడ్డి, పెంటయ్య, ఎండి.పాష, కష్ణ, యాదగిరి, కష్ణారెడ్డి, స్వామి, వెంకటేష్ , మండల కార్యదర్శి లింగారెడ్డి , పట్టణ కార్యదర్శి కోడి బాల్నరసింహ, తదితరులు పాల్గొన్నారు.