Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి
నవతెలంగాణ -నల్లగొండ
మానవ హక్కులను కాపాడాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దొడ్డికొమరయ్య భవన్లో హింసకు వ్యతిరేకంగా పొలేబోయిన వరలక్ష్మీ అధ్యక్షతన నిర్వహించిన సెమినార్లో ఆమె మాట్లాడారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ రోజురోజుకు మానవులపైన, మహిళలపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ దాడులను అరికట్టి హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వాలు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ హక్కులకు, మహిళా హక్కులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలే హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఒకవైపు అంతర్జాతీయ స్థాయిలో ప్రజలకు ఎలాంటి నూతన మానవహక్కులను అందించాలో అంతర్జాతీయ సంస్థలు అధ్యయనం చేస్తుంటే మరొకవైపు భారత దేశంలోని మోడీ ప్రభుత్వం పౌర హక్కులను మానవహక్కులను ఏవిధంగా కాలా రాయాలో, రాజ్యాంగాన్ని తమకు అనుగుణంగా ఏవిధంగా మార్చుకోవాలో కుటిల ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇది మానవ సమాజానికి, మానవ హక్కులకు,మానవుని స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ఏమాత్రం శ్రేయస్కరం కాదని వారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా మహిళలులోనూ పౌరులలోనూ చైతన్యాన్ని తీసుకొచ్చి రాజ్యాంగం భారత పౌరులకు మహిళలకు బాల బాలికలకు కల్పించిన హక్కులను పరిరక్షించుకుంటామన్నారు. మహిళల కోసం అనేక చట్టాలు తీసుకొస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప ఆచరణలో ఎక్కడా కూడా మహిళల హక్కులకు రక్షణ కల్పించిన దాఖలాలు లేవన్నారు. ఈ సెమినార్లో జిల్లా సహాయ కార్యదర్శి కొండా అనురాధ, నిమ్మల పద్మ,భూతం అరుణకుమారి, జిల్లా ఉపాధ్యక్షురాలు దైదా జానకమ్మ, పట్టణ అధ్యక్షురాలు కనుకుంట్ల ఉమారాణి, గోల వెంకటమ్మ , మంజుల , సులోచన, శశికళ పూలమ్మ, పద్మ,తదితరులు పాల్గొన్నారు.