Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 1271ఓట్లకు గాను పోలైన ఓట్లు 1233..
అ 97.01 శాతం పోలింగ్ నమోదు..
అ మూడంచెల భద్రత మద్య బ్యాలెట్ బాక్స్‌లు...
అ 14న ఎన్నికల కౌంటింగ్....
ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మొన్నటి వరకు ఇతర ప్రాంతాలకు టూర్ వెళ్లిన ఓటర్లంతా శుక్రవారం నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 1271 మంది ఓటర్లు ఉన్నారు. అందులో శుక్రవారం 1233 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగతా 38 మంది ఓటుకు దూరంగా ఉన్నారు.
పోలింగ్ సరళిని పరిశీలించిన పరిశీలకులు..
నల్లగొండ జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని ఎన్నికల పరిశీలకులు అహ్మద్ నదీమ్ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. జిల్లాల్లో మొత్తం 8 పోలింగ్ కేంద్రాల ఓటింగ్ పరిస్థితులను , అక్కడి ఏర్పాట్లను , ఓటర్ల హాజరు తీరును తెలుసుకున్నారు. అంతేగాకుండా నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో, యాదాద్రి జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి పట్టణంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని పరిశీలించారు.
సూర్యాపేటలో ఓటు వేసిన మంత్రి
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని స్త్రీశక్తి భవన్ పోలింగ్ కేంద్రంలో జిల్లా మంత్రి జి.జగదీష్‌రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కాలేజీలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, హూజుర్‌నగర్‌లో శేరి సుభాష్‌రెడ్డి ఓటు వేశారు. ఇతర నాయకులంతా వారి ప్రాంతాలలో ఓటు వేశారు.
బ్యాలెట్ బాక్స్‌లకు మూడంచెల భద్రత...
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 8 పోలింగ్ పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్స్‌లను తీసుకువచ్చి జిల్లా కేంద్రంలోని మహిళ సమాఖ్య భవనంలో స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. పోటీిలో ఉన్న అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్ రూమ్‌లో భధ్రపరిచి సీల్ చేశారు.అయితే స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడంచెల భద్రత వ్యవస్థతో పాటుగా సీసీ కెమోరాలు కూడ ఏర్పాటు చేశారు.
14న కౌంటింగ్...
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఈనెల 14న మహిళ సమాఖ్య భవన్లో నిర్వహించనున్నారు. కౌంటింగ్‌కు సంబందించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. ఎన్నికల సందర్భంగా మూడు జిల్లాలో ఎక్కడ ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగియడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.