Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండ జిల్లాలో ఆయిల్ఫామ్ సాగును 2011లో సాగు చేయడం మొదలైంది. అపుడు దాదాపు ఆరు మండలాలకు మాత్రమే సాగు పరిమితం. సుమారు 241 మంది రైతులు 447 హెక్టార్లలో సాగు చేశారు. కానీ ఇపుడు 31 మండలాలలో సాగు చేయాలని దానికోసం సుమారు 300 హెక్టార్లలో చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సాగు చేసే రైతులు మొక్కలను కొనుగోలు చేసుకోవాలి. ఒక మొక్కకు ప్రభుత్వం నుంచి రూ.90రాయితీ సౌకర్యం అందుతుంది. రైతు మాత్రం రూ.33 చెల్లించాల్సి ఉంటుంది.ఒక ఎకరానికి దాదాపు 57 మొక్కలు అవసరం కాగా హెక్టారుకు సుమారు 143 మొక్కలు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఒక్క రైతుకు 25హెక్టార్ల వరకు రాయితీ సౌకర్యం ఉంటుంది.
నీరు సమృద్దిగా ఉండాలే
ఆయిల్ఫామ్ దిగుబడి అధికంగా రావడానికి నీరు సమృద్ధిగా ఉండాలి. వేసవి కాలంలో నీరు అధికంగా ఉండే బోరుబావుల కింద ఈ సాగు చేయడం మేలు. ఒక ఎకరా వరి పంట సాగుకు అవసరమయ్యే నీటితో సుమారు నాలుగెకరాల ఆయిల్ఫామ్ను సాగు చేసేందుకు వీలుంటుంది. దాదాపు అన్ని నేలలు కూడ ఈ పంట సాగుకు అనుకూలమే. నీరు నిలువని లోతైన ఓండ్రు నేలలు, అధిక సేంద్రీయ పదార్థం కలిగి, నీరు తేలికగా ఇంకిపోయే గుణం కలిగిన ఉంటే సాగుకు అనుకూలంగా ఉంటుంది.
-- ప్రభుత్వ సహాకారం..
ఆయిల్ఫామ్ సాగులో భాగంగా పంట సాగు చేసిన మొదటి నాలుగేళ్లు ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తుంది. ఒక హెక్టారుకు ప్రతి ఏటా రూ.5వేలు ఎరువులు, మరో 5వేలు అంతరపంట సాగు కోసం చెల్లిస్తుంది. ఈ సాగులో మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, మిరప, పూలు, పెసళ్లు, మినుములు, కూరగాయలు, నువ్వులు, వేరుశనగ తదితర పంటలను సాగు చేసే అవకాశం ఉంది. అయితే నాలుగేళ్లకు ఈ పంట దిగుబడి మొదలవుతుండా సుమారు 25ఏళ్ల నుంచి 30ఏండ్ల వరకు దిగుబడి వస్తుంది. అంతేగాకుండా డ్రిప్ కూడాగతంలో ఉన్న మాదిరిగానే ఎస్సీ, ఎస్టీలకు 100శాతం, బీసీలకు 90శాతం, ఐదు ఎకరాలకు పైగా ఉన్న వారికి 80శాతం రాయితీ సౌకర్యం కల్పిస్తారు.
ఉత్సహంతులైన రైతులకు శిక్షణ
ఆయిల్ఫామ్ సాగుపట్ల ఉత్సహం ఉన్న రైతులను గుర్తించి ఇప్పటికే వారికి అవసరమైన శిక్షణ కూడా ఇచ్చాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని పెద్దవేగి వద్ద ఉన్న ఐఐఓపిఆర్లో దాదాపు 150మందికి శిక్షణ ఇచ్చాం. కృష్ణా జిల్లా హాంపిపూర్ 150 మంది, ఆశ్వారావుపేటలో 150మందికి శిక్షణ కల్పించాం.
మొక్కలు కూడ అందుబాటులోనే ...
జిల్లాకు అవసరమైన మొక్కలు అందుబాటులోనే ఉన్నాయి. రుచిసోయా కంపెనీ వాళ్లే కేతేపల్లి మండలం ఇనుపాములలో నర్సరీ ఏర్పాటు చేసింది. సుమారు 25లక్షల మొక్కలను పెంచుతున్నారు. ఆ కంపెనే వాళ్లే రైతులకు మొక్కలు సరఫరా చేయడంతో పాటుగా ఉత్పత్తిని కూడా కొనుగోలు చేస్తారు. రైతులు పండించిన పంట అమ్మకాలను విక్రయించుకోవడానికి ఏ సమస్య ఉండదు. అందుకే రైతులు పంటల సాగుకు ముందుకు వస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి.