Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-గుర్రంపోడు
గ్రామపంచాయతీ కార్మికులకు నెలకు కనీసవేతనం రూ.21 వేలివ్వాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.సోమవారం ఆయన గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ పిలుపుమేరకు మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మండలపంచాయతీ అధికారికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా తమ ఆరోగ్యాలను ప్రాణాలను సైతం లెక్కచేయకుండా గ్రామాలలో అనేక సేవలందించిన జీపీకార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పదకొండవ పీఆర్సీ హామీ మేరకు రూ.21 వేల కనీసం వేతనం అమలు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా ఉలుకుపలుకూ లేకుండా ఉన్నారని విమర్శించారు.పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో బతకలేక చావలేక కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వేతనాల పెంపు పర్మినెంట్, బీమా అమలు చేయాలని కోరారు. వేధింపులు,తొలగింపులు ఆపాలని, పెండింగ్ వేతనాలను వెంటనే ఇవ్వాలని తదితర డిమాండ్లను పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వనమాల కామేశ్వర్ యూనియన్ మండల అధ్యక్షకార్యదర్శులు పగిడి మర్రి సర్వయ్య, నీల ఆంజనేయులు, జ్వాల యాదయ్య,రేపాక ఈదయ్య, రేపాక ముత్తమ్మ, పి.క్రాంతి, నాగయ్య, కారోబార్ షేక్ మున్న పాల్గొన్నారు.