Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.2.74 కోట్లు స్వాహా
- ఆరేండ్ల తర్వాత పోలీసు దర్యాప్తు
- నలుగురు నిందితుల అరెస్టు
- వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకటేశ్వరరావు
నవతెలంగాణ- మిర్యాలగూడ
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని సల్కునూరు గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ధాన్యం కొనుగోలులో జరిగిన రూ.2,74,70,553.34 కోట్ల స్వాహా తతంగాన్ని ఎట్టకేలకు పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించి గురువారం మిర్యాలగూడ రూరల్ పోలీసు సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ వై.వెంకటేశ్వరరావు మీడియాకు వివరించారు. 2014-15 వ్యవసాయ రబీ సీజన్లో సంఘం ఆధ్వర్యంలో రైతుల నుంచి సుమారు రూ.3,99,92,960 విలువ గల సుమారు 28,566.4 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఆ ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖాధికారుల ఆదేశాల మేరకు మాడ్గులపల్లి మండల కేంద్రంలో అప్పగించారని తెలిపారు. ఆ ధాన్యాన్ని కస్టం మిల్లింగ్ చేసి బియ్యంగా చేసి ఆ శాఖకు ఇవ్వాల్సి ఉందన్నారు. మిల్లింగ్ జరిగిన తర్వాత 1,942.515 మెట్రిక్ టన్నుల బియ్యం పౌరసరఫరాల సంస్థకు ఇవ్వాల్సి ఉండగా 1,522.288 మెట్రిక్ టన్నులు తక్కువగా ఇచ్చారు. ఆ సమయంలో పౌరసరఫరాల సంస్థ అధికారులు 2016లో తిప్పర్తి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసులో ప్రధాన నిందితుడు వి.శ్రీనివాస్, డి.గోపాలకృష్ణారెడ్డి సహకారంతో పౌరసరఫరాల శాఖ నుంచి సల్కునూరు సంఘంలో కొనుగోలు చేసిన ధాన్యం కస్టం మిల్లింగ్ కోసం భార్య వి.మల్లీశ్వరి పేర అనుమతి పొందాడన్నారు. అందులో భాగంగా నిందితులు సంఘం చైర్మెన్ కె.లక్ష్మారెడ్డి, సీఈవో ఎం.మాణిక్యం, రిటైర్ గుమాస్తా ఎం.రాంరెడ్డిలు ధాన్యం కొనుగోలు చేయకుండా తెలిసిన రైతుల పేర్లు, తప్పుడు 70 ట్రక్ చిట్స తయారు చేసి రూ.1.10 కోట్ల ధాన్యాన్ని కొన్నట్టు చూపి పీడీఎస్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు ఇచ్చారన్నారు. ఇందులో సఫలీకృతమైన నిందితులు 2014-15 రబీ సీజన్లో కొనుగోలు చేసిన బియ్యం పూర్తిగా చెల్లించకపోవడంతో కేసు నమోదైందన్నారు. కేసు చేధించే ప్రక్రియలో వాహనాల నకిలీ నెంబర్లు, తప్పుడు పత్రాలు, నిందితుల, బినామీ, మరికొంత మంది పేర్లపై బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. బినామీల నుండి డబ్బు డ్రా చేసుకున్నారన్నారు. నిందితులు వి.శ్రీనివాస్, కె.లక్ష్మారెడ్డి, ఎం.మాణిక్యం, ఎం.రాంరెడ్డిలను కోర్టులో హాజరు పర్చినట్టు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన సీఐ ఎం.సత్యనారాయణ, మాడ్గుపల్లి ఎస్సై రామ్మూర్తిలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ సమావేశంలో మిర్యాలగూడ రూరల్ ఎస్సై సుధీర్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.