Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
అర్ధ శతాబ్దానికి పైగా దేశ ప్రజలకు విశిష్టమైన సేవలందిస్తున్న బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటు పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టి నిర్వీర్యం చేయొద్దని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 9 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు ఈ నెల 16, 17 తేదీల్లో 48 గంటలపాటు నిరవధికంగా చేపట్టిన దేశవ్యాప్త జాతీయ బ్యాంకు ఉద్యోగుల సమ్మెలో భాగంగా రెండవ రోజు దేవరకొండలో బ్యాంకు ఉద్యోగ, కార్మికులు చేపట్టిన సమ్మె ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, అధిక మొత్తంలో ఆర్థిక లావాదేవీలు, ఖాతాదారులు కలిగిన 22,219 బ్రాంచీలు, 51 బిలియన్ డాలర్ల ఆదాయం కలిగిన, 66 సంవత్సరాల సువర్ణ చరిత్ర కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ బ్యాంకును బడా వ్యాపార వేత్త ఆదానీ కంపెనీని భాగస్వామిగా చేస్తూ ఒప్పందం చేయడం దేశద్రోహం అని, కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్లో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను, ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తామని ప్రకటించిందని ఆరోపించారు.ముందుగా పట్టణంలో మీనాక్షి హౌటల్ నుంచి ఎస్బీఐ బ్యాంక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కన్వీనర్ ఎన్వీటీ, వెంకట్రావు, సీపీఐ మండల కార్యదర్శి పి.కేశవ రెడ్డి, దేప సుదర్శన్‌రెడ్డి, ఏఐటీయూసీ డివిజన్ అధ్యక్షులు నూనె వెంకటేశ్వర్లు, కార్యదర్శి నూనె రామస్వామి, జూలూరు వెంకట్రాములు, ఎండీ మైనొద్దీన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వలమల్ల ఆంజనేయులు, మల్లయ్య, నగేష్, కందుకూరు శ్రీను, శేఖర్ పాల్గొన్నారు.
కోదాడరూరల్:ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ చేసే ఆలోచననను కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ నాయకులు కందర్ప సూర్యనారాయణ డిమాండ్ చేశారు.శుక్రవారం ఆ యూనియన్ పిలుపు మేరకు శ రెండవ రోజు పట్టణంలో బ్యాంకుఉద్యోగులు పట్టణశాఖ నందు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయరంగం బలహీనవర్గాల సంక్షేమానికి చిన్న,మధ్య తరహా పరిశ్రమలు అనేకరంగాలకు జాతీయ బ్యాంకులు తోడ్పాటును అందిస్తున్నాయన్నారు.సామాన్య మధ్యతరగతి పేద ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయొద్దని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.అనంతరం పట్టణంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. రెండవ రోజు సమ్మెకు మద్దతు తెలుపుతూ సీపీఐ,సీపీఐ(ఎం) నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి ముత్యాలు, బ్యాంక్ యూనియన్ నాయకులు కందర్ప సూర్యనారాయణ, లక్ష్మణ్, రవీంద్ర, వెంకటరత్నం, మహేష్, స్రవంతి, ఏఐటీయూసీ జిల్లా నాయకులు మేకల శ్రీనివాసరావు, షేక్ రెహమాన్, రైతు సంఘం జిల్లా నాయకులు మెదరమెట్ల వెంకటేశ్వరరావు, గంటనాగరాజు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.