Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జిల్లా విద్యా శాఖ నుండి జరిగే అలకేషన్ ప్రక్రియలో అన్ని కేటగిరీల ఉపాధ్యాయుల సీనియార్టీ లిస్టులోని లోపాలను పూర్తిగా సవరించాకే ఉపాధ్యాయుల జిల్లాల ఆప్షన్స్ వివరాల లిస్టు కూడా ప్రకటించి పారదర్శకంగా జిల్లాలకు కేటాయింపులు జరపాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా శాఖఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్.రాములు మాట్లాడారు. ఇప్పటికే ఉమ్మడినల్లగొండ జిల్లావ్యాప్తంగా రెండురోజులుగా ఉపాధ్యాయుల నుండి వస్తున్న అభ్యంతరా లన్నింటిని పరిగణలోకి తీసుకొని ఉన్న జీవోలు, నియమ నిబంధనలకు అనుగుణంగా సీనియార్టీ లిస్టు, జిల్లాల ఆప్షన్స్ వివరాల లిస్టులు ప్రకటించి వాటిని అందరూ పరిశీలించడానికి తగిన సమయం ఇచ్చి మరల వచ్చిన అభ్యంతరాలను స్వీకరించాలన్నారు.అభ్యంతరాలను సరిచేసి ఫైనల్ లిస్ట్ ప్రకటించిన తర్వాత జిల్లాలకు కేటాయింపులు జరిగితే ఉపాధ్యాయులకు న్యాయం జరుగు తుందన్నారు.స్పెషల్ కేటగిరి ఉన్న వారి మెడికల్ సర్టిఫికెట్లు పూర్తిస్థాయిలో పరిశీలన జరిపి, ఫేక్ సర్టిఫికెట్లను తొలగించి అర్హులకు న్యాయం జరిగే విధంగా చూడాలలన్నారు.జీవో 610, అంతర్ జిల్లాల ద్వారా వచ్చిన వారిని ఉన్న జీవోల ప్రకారం సీనియార్టీ లిస్టులో చేర్చాలని కోరారు.సీనియార్టీ లిస్టు కన్నా ముందే జిల్లాలకు అలాటైన వారిని ఆ జిల్లాలో పాఠశాలకు ఏ విధంగా కేటాయిస్తారనే అంశంలో ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు లేని కారణంగా ఉపాధ్యాయులందరూ ఆందోళనకు గురై జిల్లాలకు ఆప్షన్ ఇవ్వడంలో ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారనారు.ఇప్పటికైనా రాష్ట్ర విద్యాశాఖ స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రకార్యదర్శులు రాజశేఖర్‌రెడ్డి, నాగమణి, నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి యాదాద్రి, జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ఎడ్ల సైదులు,పెరుమాళ్ల వెంకటేశం,అనిల్‌కుమార్, సోంబాబు, యాదయ్య, సైదులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.