Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడేండ్ల క్రితం జిల్లాలను విభజన చేశారు. కానీ అనుకున్న లక్ష్యం నేటికి 10శాతం కూడా నేరవేరలేదు. జిల్లాలో ఉన్న అనేక రకాల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పేరుకుపోయి ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌బెడ్ రూం ఇండ్ల పంపిణీ, దేశానికి అన్నంపెట్టే అన్నదాతలలో భాగమమైన కౌలు రైతులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా అందడంలేదు. జిల్లాలలో పేరెన్నిక గన్న పరిశ్రమలున్నప్పటికి జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి లేకుండాపోయిన దుస్థితి ఉంది. ఇలా చెపుకుంటే పోతే అనేక సమస్యలు జిల్లాలో ఉన్నాయి. ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయని వాటి పరిష్కారం కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన నిర్వహించేందుకు తగిన ప్రణాళికలను రూపొందించేందుకు పార్టీ మహాసభల్లో నిర్ణయం తీసుకుంటున్నట్టు సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి తెలిపారు. జిల్లా మహాసభల సందర్భంగా ఆయన నవతెలంగాణతో మాట్లాడారు.
భూమి ఉంటేనే సామాజిక అణిచివేతకు అడ్డుకట్ట..
సహజంగా సమాజంలో సామాజిక అణిచివేతకు గురైన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు భూమి ఉంటేనే సామాజిక, ఆర్థిక అణిచివేత నుంచి విముక్తి పొంది, సమాజంలో సామాజిక హోదా లభిస్తుంది. అయితే దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన సర్కార్ భూములు ఇవ్వకపోగా గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములను శ్మశాన వాటిక, రైతు వేదిక, ఇతర అవసరాల పేరుతో దళిత గిరిజనుల భూములను లాగేసుకున్నారు. ఇలా వందల ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. అంటే దళితులను అణిచివేసే కుట్రకు తేరలేపడంలోనే ఇదోక భాగంగా భావిస్తున్నాం.
డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీకి మోక్షమెపుడో...
సూర్యాపేట జిల్లాలో సూర్యపేట పట్టణ కేంద్రంలో కొంత మందికి మాత్రమే డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. మిగతా ఏ మండలంలో కూడా నిర్మాణం కూడా మొదలు కాని పరిస్థితి ఉంది. ఏడేండ్లలో ఒక్క గ్రామంలో ఇండ్లను పంపిణీ చేయలేదు. పోలుమల్ల గ్రామంలో గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల స్థలాలను కూడా ఇప్పుడున్న పాలకులు లాగేసుకున్నారు. ఇలాగే వ్యవహరిస్తే దాదాపు 100ఏండ్లయినా అందరికి ఇండ్లు అందే పరిస్థితి ఉండదు. అంతేగాకుండా స్థలం ఉన్న వారికైనా ఆరులక్షలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి సహకరించాలి.
కౌలు రైతుల కన్నీటి గాధను అర్థం చేసుకోని పాలకులు..
జిల్లాలో సుమారు 15వేలకు పైగా కౌలు రైతులుంటారు. వారంతా పట్టాదారులైన రైతులతో సమానంగా పంటలు సాగు చేస్తున్నారు. కానీ ఈ రైతులకు ప్రభుత్వం నుంచి ఏలాంటి సంక్షేమ పథకాలు లేవు. రైతు బంధు, రైతు బీమా, రాయితీపై విత్తనాలు, ఏరువులు, పంటరుణాలు లాంటివి ఏవి కూడా అందడంలేదు. ఏ పంట సాగు కానీ భూములకు రైతు బంధు ఇస్తున్నారే కానీ వ్యవసాయ రంగంలో జీవిస్తూ అనుకోని స్థితిలో మరణించి కౌలు రైతులకు ఏ సహకారం కూడా అందించడంలేదు. ఈ మద్య అనేక మంది కౌలు రైతులు పంట దిగుబడి రాక..అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న వారే అధికం. ఇలాంటి కౌలు రైతుల కన్నీటి గాధలు ప్రభుత్వం కంటికి కనిపించడంలేదు.
సాగునీటి కాల్వల మరమ్మతులు చేపట్టాలి
జిల్లాకు ఎస్ఆర్ఎస్పీ, మూసీ, సాగర్ ఎడమ కాల్వలు ప్రధాన సాగునీటి వనరులు. అయితే సాగర్ లిఫ్టుకు మరమ్మతులు చేసి ఆధునికరించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఎస్ఆర్ఎస్పీ ప్రధాన కాల్వ పూర్తయింది. పిల్ల కాల్వలు లేవు. నీటిని వదిలేస్తే వృధాగా పోతున్నాయి. అందువల్ల పిల్ల కాల్వలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మూసీ ప్రాజెక్టు గేట్లు మరమ్మతులు చేయకపోవడం వల్ల తీవ్రనష్టం జరుగుతుంది. వెంటనే వాటికి మరమ్మతులు చేయించి ఆదునీకరించాల్సిన అవసరం ఉంది.
నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపలేదు..
ఏడేండ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపలేదు. నిధులు, నీళ్లు , నియమాకాలే లక్ష్యంగా సాగిన తెలంగాణ ఉద్యమం ఫలితంగానే రాష్ట్ర ఏర్పాటు జరిగింది. కానీ నేటి సీఎం కేసీఆర్ ఆ విషయాలనే పూర్తిగా మరిచిపోయాడు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. డిఎస్సీ అడ్రస్ లేదు. పాలకుల రక్షణ కోసం మాత్రం కేవలం పోలీసు ఉద్యోగాలను కొన్ని భర్తీ చేశారు.ప్రభుత్వ పోటీ పరీక్షల కోసం యువత శిక్షణ తీసుకోవడానికి ఎస్సీ స్టడిసర్కిల్ ఏర్పాటు చేశారే కానీ బీసీ స్టడిసర్కిల్ లేదు. ఇక్కడ పరిశ్రమలు ఉన్నప్పటికి స్థానికులకు ఉద్యోగాలు లేవు. ఉన్న ఉద్యోగులకు కంపేనీలలో కనీస సౌకర్యాలు కల్పించరూ..
పోడు భూముల సమస్యను కొలిక్కి తీసుకురావాలి
జిల్లాలో పాలకీడు, మఠంపల్లి, చింతలపాలెం, మేళ్ల చెర్వు మండలాలలో పోడు భూముల సమస్యలున్నాయి. అయితే ఇక్కడ సుమారు 2వేల మంది గిరిజనులు, గిరిజనేతరులు సుమారు 50ఏండ్లుగా ఆ భూములను సాగు చేసుకుంటున్నారు.అయితే వాటిని గిరిజనులకు పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. కానీ వాటిపై ప్రభుత్వం ఒక్కడగు ముందుకు వేయలేదు. భవిష్యత్ కార్యాచరణను కూడా ఇప్పటి ప్రకటించలేదు. చిత్తశుద్ధితో పోడు భూముల సమస్యలను పరిష్కరించాలి.
రైతులకు గిట్టుబాటు ఇవ్వాలే
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అప్పులపాలవుతున్నారు. వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఏరువులు, కూలీల రేట్లు పెరగడం , దున్నకం కోసం ధరలు పెరగడం వల్ల రైతులకు భారం పెరిగింది. కానీ పంట కొనుగోలు రెట్లు మాత్రం పెరగడంలేదు. అందుకే రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదా కేరళ ప్రభుత్వం మాదిరిగా వరికి క్వింటాళుకు రూ.800 అధనంగా చెల్లించాలి. ఇప్పుడు వరి కొనుగోలు చేయమని చెపుతున్నారే కానీ ఆరుతడి పంటల సాగుపై రైతులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు.
వైద్యం అందని ద్రాక్షగా మిగిలింది..
సామాన్యులకు అనార్యోగం వస్తే ప్రాణాలను కొల్పొవడం తప్ప వేరే మార్గం లేదు.
ప్రభుత్వం అందించే వైద్యం పేదలకు అందడంలేదు. గ్రామాలలో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సుమారు 10వేల జనాభాకు ఒకటి చొప్పున ఉన్నాయి. వాటి స్థానంలో 5వేల జనాభాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రవేటు వైద్యం పేదలకు అందుబాటులో లేదు. మండలాలో ఉన్న పిహెచ్‌సీలలో సరైన వసతులు, సిబ్బంది లేరు. పేదలకు సరైన చికిత్స అందడంలేదు.
పింఛన్ల ఊసేలేదు
జిల్లాలో ఇప్పటివరకు సుమారు 15వేలకు పైగా ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వితంతువుల, వృద్ధులు అనేక మంది వాటికోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. 57ండ్ల వయస్సు కలిగిన వారికి కూడా ఫించన్లు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం నేటికి వాటి ఊసేత్తడంలేదు. గతంలో ఒకరు చనిపోతే వెంటనే మరోకరికి పింఛన్ చెల్లించేవాళ్లు.. కనీసం ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. అర్హులైన పేదలంతా పింఛన్ల కోసం నెలల తరబడి ఏదురుచూస్తున్నారు. నాలుగేండ్లుగా ఒక్కరికి కూడా ఎలాంటి పింఛన ప్రభుత్వం మంజూరు చేయలేదు.
భవన నిర్మాణ కార్మికులకు వెజ్బోర్డులో సుమారు 1500క్లైయిమ్స్ పెండింగ్‌లో ఉన్నాయి. దానికి ప్రధాన కారణం అందుబాటులో లేకపోవడం. జిల్లా కార్మిక శాఖ విభాగంలో పనిచేసే అధికారులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో కార్మికులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలు దరిచేరడంలేదు. గీత కార్మికులకు కార్పోరేషన్‌కు రూ.500కోట్లు కేటాయించాలని గత కొన్నేండ్లుగా డిమాండ్ ఉంది. కానీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఇకనైనా పాలకుల తీరు మారి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలి . లేకపోతే మరో రెండు రోజుల్ల జరగనున్న సీపీఐ(ఎం) జిల్లా మహాసభలలో ఈ సమస్యలపై చర్చించి ఆందోళనకు ప్రణాళికలు రూపొందిస్తాం.