Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి ?
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ - నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రైతులతో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దండోరా వేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. హుజూర్‌నగర్‌లో నిర్వహించిన సీపీఐ(ఎం) జిల్లా రెండో మహాసభలు బుధవారం కొనసాగాయి. ఈ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పాల్గొన్నారు. అనంతరం జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతులపై కుట్ర పన్ని ధాన్యం కొనుగోలు చేయకుండా నాటకాలు ఆడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాలను కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారిన మోడీ మెడలు వంచైనా సరే ధాన్యం కొనుగోలు చేసేలా ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఈ మూడూ అమలు కాలేదన్నారు. దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పర్మినెంట్ లాంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లాలో కౌలు రైతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, వారికి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, బ్యాంకు రుణాలిచ్చి ఆదుకోవాలని కోరారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ ద్వారా 200 రోజుల పనిదినాలు కల్పించి రోజుకు రూ.600 ఇవ్వాలన్నారు. వలసల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, వారికి పని భద్రత కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. విజయవాడ నుంచి సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వరకు, మిర్యాలగూడ నుంచి సూర్యాపేట మీదుగా కాజీపేట వరకు రైల్వేలైన్ వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు, మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ధీరావత్ రవి నాయక్, బుర్రి శ్రీరాములు, కొలిశెట్టి యాదగిరిరావు, నెమ్మాది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.