Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభావతి
నవతెలంగాణ -నల్లగొండ
ఆడపిల్ల సమాజంలో మనుగడ సాధించాలంటే ప్రశ్నించడం నేర్చుకోవాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు. గురువారం నల్లగొండ మండలంలోని కంచనపల్లిలోని ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్లో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ నేడు కుటుంబం చూపించే కారణాలను విశ్లేషిస్తే గానీ అసలు కారణాలు అర్థం కావన్నారు. ఇప్పటికీ అల్ట్రాసౌండ్ సెంటర్లకు వెళ్ళి స్కానింగ్ చేయించుకుని ఆడపిండాలను హత్యలు చేస్తున్నారన్నారు. 1000 మంది అబ్బాయిలకు 912 మంది మాత్రమే బాలికలున్నారన్నారు. పురుషాధిక్య భావజాలాన్ని యథాతథంగా కొనసాగిస్తూ ఎన్ని కొత్తచట్టాలు తెచ్చినా ఫలితం శూన్యమన్నారు. మగవాడు తన భార్యను కొట్టే హక్కును కలిగి ఉన్నాడని నమ్మే సమాజంలో గహహింస నేరం, కొట్టడం చట్టరీత్యా నేరమని చెప్పడంలో ఉన్న రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారన్నారు. చట్టం వచ్చి దశాబ్ద కాలం దాటినా కుటుంబాల్లో హింస విపరీతంగా పెరుగుతూనే ఉందికానీ చట్టం అమలుకావడంలేదన్నారు. తాగుడు వల్ల కుటుంబాల్లో ఎంత హింస జరుగుతుందో తెలిసి కూడా ప్రభుత్వం మద్యం దుకాణాలు నడుపుతుందని విమర్శించారు. దేశ వివాహ వయస్సును పెంచినప్పటికీ ఎవ్వరికీ చట్టభయం లేదన్నారు. బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. అతి చిన్న వయస్సులో కుటుంబభారాన్ని మోస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ కవిత, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కొండఅనురాధ, సీనియర్ నాయకురాలు బొల్లోజు బారతమ్మ ,తదితరులు పాల్గొన్నారు.