Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గురుకులాలు పేరు వినగానే రాష్ట్ర స్థాయి ర్యాంకులు, ఉన్నత విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్లు, రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడల్లో గుర్తింపు లాంటి విషయాలు గుర్తుకొస్తాయి. నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖల గురుకులాలు కనీస వసతుల్లేక అల్లాడుతున్నాయి. తాగునీటికి కూడా అతికష్టంగా ఉంది. ఆడుకోవడానికి ఆట స్థలం ఉన్నా పట్టించుకోని వైనం... ఇల్లీగల్ పనులు చేసే సిబ్బందికి ఉన్నతాధికారులే అండగా ఉంటున్న తీరు... తదితర సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికి గురుకులాలకు సంబంధించిన జిల్లా అధికారులు కనీసం స్పందించడంలేదు.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం దాదాపు 25గురుకులాలు ఉన్నాయి. అందులో సుమారు 20వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తూ , వసతి పొందుతున్నారు. అయితే ఇందులో సుమారు 5 పాఠశాలలకు సొంత భవనాలున్నట్టు సమాచారం. మిగతా పాఠశాలలు అద్దె భవనాలలో కొనసాగుతున్నాయి. ఈ భవనాల్లో మరుగుదొడ్లు, స్నానపుగదులు, కనీసం కూర్చొని తినడానికి కూడా స్థలం లేని దుస్థితిలో ఉన్నాయి.
కనీస వసతులు కరువు
జిల్లాలో ఉన్న ఎస్సీ గురుకులాలలో కనీస వసతులు కరువవుతున్నాయి. అంతేగాకుండా భయంకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు సమీపంలో ఉన్న బాలుర గురుకుల పాఠశాల పూర్తిగా అడవిలో ఉన్నట్టుగానే ఉంది. అక్కడ పాఠశాల చుట్టూ ప్రహారి గోడ లేకపోవడం వల్ల పాములు, ఇతర జంతువులు వస్తున్నాయి. నిత్యం వాటితో సోపతి చేయాల్సివస్తోంది. ఏ రాత్రి వేల ఎలాంటి ప్రమాదం జరుగుతుందోననే భయంలో విద్యార్థులున్నారు. పారిశుధ్యం కూడా దారుణంగా ఉందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. అదే మండలకేంద్రానికి సమీపంలో ఉన్న బాలికల గురుకుల పాఠశాలకు సమీపంలో విశాలమైన ఆటస్థలం ఉండేది. కానీ నేడు అదంతా మురుగు కాల్వలకు నిలయంగా, చెట్ల పొదలకు అడ్డాగా మారింది. అక్కడ ఆటలు బంద్ చేశారు. అంతేగాకుండా పాఠశాల ప్రహారిలోపల సంప్ పూర్తిగా మురుగు నీటితో నిండిపోయి దోమలకు నిలయంగా మారింది. అంతేగాకుండా వర్షం వస్తే ప్రహారిలో పూర్తిగా సముద్రాన్ని తలపించేలా వర్షం నీరుంటుంది. ఇక జిల్లా కేంద్రంలో ఉన్న ఓ గురుకులంలో నీటి ట్యాంకు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. డ్రైనేజీ సరిగా లేక బయటికి వస్తుండంతో విద్యార్థులు దుర్వాసనకు తట్టుకోలేకపోతున్నారు. విద్యుత్ మీటర్లకు పై కప్పులు లేవు.. వైర్లు ఎక్కడిక్కడే తెలిపోయాయి. అంతేగాకుండా జిల్లా కేంద్రంలోని మరో గురుకులంలో ఆట స్థలం ఉన్న వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. ఇలా చెపుకుంటుపోతే ప్రతి పాఠశాలలో సమస్యలకు నిలయంగా ఉన్నాయి.
అద్దెకు నూతన భవనాలు అందుబాటులో ఉన్న....
ఇప్పుడు అద్దె భవనాల్లో ఉన్న పాఠశాలలో కనీస వసతులు లేవు. వాటి స్థానంలో వేరే అద్దె భవనాలు అందుబాటులో ఉన్నా ఇపుడున్న రిజియన్ అధికారులు పాత వాటిపైనే మక్కువ చూపిస్తున్నారు. కొత్త వాటిని గత మూడేండ్లుగా ఆయా గురుకులాల టీచర్లు, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ బాధ్యులు అన్ని వసతులు కలిగిన, పట్టణానికి అతీసమీపంలో ఉన్న భవనాలను చూస్తున్నప్పటికి గురుకుల అధికారులు ఆసక్తి చూపించడంలేదు. దానికి ప్రధాన కారణం ఇప్పుడున్న గురుకుల భవనాల యాజమాన్యం నుంచి కమీషన్లు అందుతున్నట్టు సమచారం. అందుకే అంతగా మక్కువ చూపిస్తున్నారని తెలిసింది. ఈ ఒక్కటే కాదు ప్రతి పనిలో తనకేంటి అనే పద్దతిలో కమీషన్ల కోసం పనిచేస్తారని సమాచారం. పిల్లలకు ఏమైతే తమకేంటి... తమకు రావాల్సిందే వస్తే చాలు అన్న చందంగా అధికారుల పరిస్థితి ఉంది.
మిగిలిన సీట్లకు బేరం..?
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గురుకులాల ఉన్నతాధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురుకలాలలో మిగిలిన సీట్లను కూడ తమకు నచ్చిన వారికే కేటాయించే కిందిస్థాయి ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీచేస్తున్నారు. నవంబర్ 30 తర్వాత ఆయా గురుకులాలలో మిగిలిన సీట్లను భర్తీ చేయాడానికి ఆర్సీవోలకు అనుమతిచ్చారు. అయితే ఆ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇటివలే నల్లగొండ ఆర్సీవో నవంబర్ 18న ఓ విద్యార్థికి సీటు కచ్చితంగా ఇవ్వాలనే జిల్లా కేంద్రంలో ఉన్న ప్రిన్సిపాల్‌కు లిఖిత పూర్వకమైన ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. ఇలా చాలా సీట్లు తనకు నచ్చిన వారికి కేటాయించి సొమ్ము చేసుకున్నట్లు కూడా సమాచారం. పాఠశాల సమస్యలపై మాట్లాడేందుకు శాసనసభ్యులు ఫోన్ చేసినా ఎత్తడంలేదని ఈ మద్య ఓ ఎమ్మెల్యే తీవ్రంగా మందలించినట్టు తెలిసింది.
విద్యార్థులను దండిస్తున్న వైనం
ప్రభుత్వ పాఠశాలలో బెత్తెం ఉపయోగించకూడదనే నిబంధన ఉంది. అందులో ముఖ్యంగా గురుకులాలలో ఇది కచ్చితంగా అమలు చేయాల్సిందే. కానీ గురుకులాలలో విద్యార్థులను దండించడమే పనిగా పెట్టుకున్నట్లుగా చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో సాగర్ రోడ్డులో గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని దండిస్తే అతనికి ముక్కుపై బలమైన గాయమైంది. ఇదేంటని తల్లిదండ్రులు అడిగితే అట్టే కొడతం.. మీ ఇష్టం ఉన్న చోట చెప్పుకొండి అంటూ చిందులేశారని తెలిసింది. అంతేగాకుండా సెలవుల తర్వాత పిల్లలు ఆలస్యంగా వస్తున్నారని వాళ్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదేంటని అటెండరును అడిగితే మా మేడమ్ తీసుకొమ్మని చెప్పిందని నకిరేకల్ గురుకుల పాఠశాల అటెండర్ పేర్కొన్నారు.