Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు
నవతెలంగాణ -భువనగిరిరూరల్/నల్లగొండ
మున్సిపాలిటీలలో పారిశుధ్యం, అభివృద్ధి పనులపై ప్రత్యక్షంగా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, ఆదర్శవంతమైన పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని, పట్టణ ప్రగతికి తోడ్పడాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సూచించారు. గురువారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్లు, మున్సిపాలిటీచైర్మెన్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణ ప్రగతి, స్వచ్ఛ సర్వేక్షణ్ - 2022 వర్చువల్ ఓరియంటేషన్‌పై ప్రజాప్రతినిధులను, అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుధ్యం, పచ్చదనం, వైకుంఠదామాలు, డంప్ యార్డులు, పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ, వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల ఏర్పాటు, ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ తదితర కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. అందరి సహకారంతో 2021 సంవత్సరం తెలంగాణ సఫాయి ముద్ర చాలెంజ్‌లో రాష్ట్రం రెండవ స్థానంలో నిలిచిందని, ఇది ఆనందించదగిన విషయమని అన్నారు. కేంద్రం ప్రకటించిన పల్లె వికాసం అవార్డులో ముందున్నామని, ఇటు పట్టణాలకు సంబంధించి ముందు ఉన్నామని తెలిపారు. పట్టణ ప్రగతి కింద ఇప్పటివరకు రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీల అభివద్ధి కోసం రూ.3045 కోట్లు అందజేసినట్టు తెలిపారు. పర్యావరణం దెబ్బతినకుండా పచ్చదనం కార్యక్రమాల కోసం 10 శాతం గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించుకొని వివిధ పనులు నిర్వహిస్తూ పచ్చదనానికి తోడ్పడుతున్నామని, 2021-22 సంవత్సరంలో మునిసిపాలిటీలకు రూ.223 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఒకవైపు బహత్తరమైన కాలేశ్వరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేసుకున్నామని, ఎనిమిది శాతం గ్రీన్ కవర్ చేసి పర్యావరణానికి తోడ్పడ్డామన్నారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద రూ.3 వేల కోట్లతో పట్టణాలలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. గత అక్టోబర్2న ప్రతి వెయ్యి మందికి ఒక టాయిలెట్ ప్రకారం 14000 కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించుకున్నామని తెలిపారు. వెజ్ నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణాలకు రూ.500 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. వచ్చే జూన్ లోగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని, వైకుంఠ ధామాల పనుల కోసం రూ.200 కోట్లు కేటాయించామన్నారు. వీధులలో నేమ్ బోర్డులు అమర్చాలని, చేసిన పనులపై కరపత్రాలు, బుక్ లెట్స్ రూపంలో ప్రజలకు తెలపాలని అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్ ఫర్ సిటీ మేనేజర్స్ యాప్ ను ఆయన విడుదల చేశారు.రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, ఎండి. ఎస్.బి.ఎం. అరవింద్ కుమార్ పరిశుభ్రమైన పట్టణం, స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 కార్యక్రమాలపై ప్రజా ప్రతినిధులు, అధికారులు చేపట్టవలసిన కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ, ప్రొఫెసర్ శ్రీనివాసాచారి, నిపుణులు కే.వీ. రంజిత్, ఉదరు సింగ్, శ్రీనివాస్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మెన్ ఆంజనేయులు, ఆలేరు మున్సిపల్ చైర్మెన్ శంకరయ్య, మోత్కూర్ మున్సిపల్ చైర్ పర్సన్ సావిత్రి, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ సుధ, పోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్లు, నల్లగొండ జిల్లా నుండి అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, పబ్లిక్‌హెల్త్ ఎస్ఈ కందుకూరి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి పాల్గొన్నారు.