Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యాపేట:సూర్యాపేట జిల్లావ్యాప్తంగా వివిధ పోలీసుస్టేషన్లలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుళ్లను నల్లగొండ,యాదాద్రి భువనగిరి జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు బదిలీలు చేయడం అన్యాయమని మహిళా కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.సూర్యాపేట జిల్లాకేంద్రంలో పోలీసుల కుటుంబ సభ్యులు గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ జిజీవో 317 ప్రకారం కేవలం సీనియార్టీ ఆధారంగా ప్రస్తుతం చేస్తున్న బదిలీలలతో పోలీసు కుటుంబాలు చిన్నాభిన్నం అవు తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటివరకు సూర్యాపేట జిల్లాలో పనిచేస్తూ ఇక్కడే తమ అత్త,మామలను చూసుకుంటూ, పిల్లలను ఇక్కడే చదివిస్తున్న మహిళా కానిస్టేబుళ్లను అకస్మాత్తుగా ఇతర జిల్లాలకు బదిలీలు చేయడం అన్యాయమని వాపోయారు.ఈ బదిలీలతో భార్య ఒక చోట ఉద్యోగం చేస్తే భర్త మరొకచోట కుటుం బాధ్యతలు చూడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు.బదిలీల మూలంగా కుటుంబపెద్దలు,పిల్లలు పడే కష్టాలు మాటలలో చెప్పలేనివని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా 128 మంది కానిస్టేబుళ్లను బదిలీలు చేశారని, అందులో 40 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారన్నారు.కేవలం సీనియార్టీ ఆధారంగా జరుగుతున్న బదిలీలు నిలిపివేసి మహిళా కానిస్టేబుళ్ల కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.