Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మున్సిపల్ సమావేశంలో అధికారులపై కౌన్సిలర్ల ఆగ్రహం
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ పట్టణంలో దుకాణదారులు వద్ద ట్రేడ్ లైసెన్స్ వసూలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని వివిధ వార్డుల కౌన్సిలర్లు మండిపడ్డారు. గురువారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో చైర్మన్ సైదిరెడ్డి అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పూర్తి సమాచారంతో మున్సిపల్ అధికారులు రాకపోవడం, మిగతా శాఖల అధికారులు హాజరు కాకపోవడంతో కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లీడర్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు దున్నపోతు మీద వాన కురిసినట్టు వ్యవహరిస్తున్నారని, పట్టణంలో ట్రేడ్ లైసెన్స్ క్రమబద్ధీకరణ, రెన్యువల్ వసూలు ఎందుకు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద వ్యాపారస్తులు మాత్రమే కార్యాలయానికి వచ్చి రెన్యువల్ చేసుకుంటున్నారు తప్పా మిగతా షాపుల వద్దకు వెళ్లి లైసెన్స్ బిల్లులు ఎందుకు వసూలు చేయడం లేదని, ఇలా అయితే పట్టణం ఎలా అభివద్ధి చెందుతుందని ఆరోపించారు. సూర్యాపేట, మిర్యాలగూడలో పనిచేస్తున్న ఆన్లైన్ సేవలు నల్లగొండలో ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నించారు. 31వ వార్డు కౌన్సిలర్ ఖయ్యిం భేగ్ మాట్లాడుతూ వార్డుల వారీగా షాపులు ఎన్ని ఉన్నాయని ప్రశ్నించారు. కానీ అధికారులు వివరాలు తీసుకు రాలేదని సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్య శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల, కాలేజీలు రూ.లక్షల్లో బకాయి ఉన్నాయని, వాటిని వసూలు చేయాలని కోరారు. బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి ప్రసాద్ మాట్లాడుతూ పట్టణంలో నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్ ద్వారా మున్సిపాలిటీకి కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పోతుందని, ఈ విషయంపై మంత్రి కేటీఆర్‌కు వినతిపత్రం అందజేయాలన్నారు. మున్సిపల్ కోఆప్షన్ నంబర్ జమాల్ ఖాద్రి మాట్లాడుతూ 26, 27 వార్డులో నీటి సమస్య తీవ్రంగా ఉందని, ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. 13వ వార్డు కౌన్సిలర్ ఊటుకూరి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సభ్యుల మాట మున్సిపల్ అధికారులు వినడం లేదని పేర్కొన్నారు. చైర్మన్ సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మాట్లాడుతూ అధికారులు నిర్లక్ష్య ధోరణి వదిలి పట్టణలోని బకాయిలను వసూలు చేస్తూ అభివద్ధికి తోడ్పడాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, బీజేపీ ఫ్లోర్‌లీడర్ బండారు ప్రసాద్, డీఈ వినోద్ కుమార్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ పిల్లి రామారాజ్ యాదవ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.