Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 10 నాటికి రూ.50వేల కోట్లకు చేరనున్న పంటపెట్టుబడి సాయం
అ ఎమ్మెల్సీ గుత్తా, ఎమ్మెల్యే భాస్కర్రావు
నవతెలంగాణ-మిర్యాలగూడ
రైతుబంధు సంబురాలను భారీ ఎత్తున నిర్వహించాలని మిర్యాలగూడ నియోజకవర్గ పార్టీ శ్రేణులకు శాసనమండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి అన్నదాతలకు పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. రైతుల బ్యాంకు ఖాతాల్లో 8విడతల్లో నేరుగా బదిలీ చేసిన మొత్తం ఈనెల 10నాటికి రూ.50,682. 30 కోట్లకు చేరనుంది. ఈనేపథ్యంలో సోమవారం నుంచి ఈనెల 10వరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు వారోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గ నేతలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో గుత్తా సుఖేందర్ రెడ్డి, భాస్కర్ రావు మాట్లాడారు. రైతు బంధు పథకం దేశానికే ఆదర్శంగా మారిందన్నారు. ఈనెల10న రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రైతు బంధు వేడుకలను నిర్వహించ నున్నామని అన్నారు. మహిళలు, యువతులు ఇండ్ల ముందు ముగ్గులు వేసినప్పుడు రైతు బంధు పథకం విశిష్టతను ప్రతిబింబించేలా రంగవల్లులు డిజైన్ చేయాలని కోరారు. పార్టీ శ్రేణులు, యువకులు గ్రామాల్లో, పట్టణాల్లో విస్తతంగా తిరిగి రైతు బంధు పథకం గురించి ప్రచారం నిర్వహించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు పండించే పంటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందిస్తోందన్నారు. ఈ మహత్తర పథకం ద్వారా రైతులు అప్పుల కోసం బ్యాంకర్లను, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్రంలో అప్పుల బాధతో రైతుల బలవన్మరణాల దాఖలాల్లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు యావత్ దేశానికే దిక్సూచిగా మారాయని, అనేక అంతర్జాతీయ సంస్థలు మన రాష్ట్రంలో పకడ్బందీగా అమలవుతున్న పథకాలను ప్రశంసిస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, టీఆర్ఎస్ నాయకులు యూసుఫ్, రైతు సమన్వయసమితి అధ్యక్షులు వీరకోటి రెడ్డి, మిర్యాలమధుసూదన్,జొన్నలగడ్డ రంగారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, కో ఆప్షన్ మెంబర్ మోసీన్ అలీ, డీసీసీబీ డైరెక్టర్ బంటు శ్రీనివాస్, ఎంపీపీ నూకల సరళ హన్మంత రెడ్డి, శ్రీవిద్య రాజు, పుట్టలభాస్కర్, బాలాజీనాయక్, నందిని-రవితేజ, జడ్పీటీసీలు లలిత హాతీరాం, ఇరుగుమంగమ్మ వెంకటయ్య, సేవ్యా నాయక్, రైతు సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.