Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తోటి విద్యార్థులు ప్రశ్నిస్తే వారిపై వేధింపులు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయప్రతినిధి
అదో ఉన్నత విశ్వ విద్యాలయం... దేశానికి స్వేచ్ఛా వాయులు రావడం కోసం జీవితాన్ని ఫణంగా పెట్టి బ్రిటీిష్ వారిని తరిమికొట్టిన మహాత్మాగాందీ పేరుతో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం. ఎన్నో గొప్ప ఆశలు, ఆశయాలతో ఏర్పాటైన దేవాలయం. కానీ ఇక్కడ ఏం జరగకూడదో అవే జరుగుతున్నాయి.. దేనినైతే పారదోలాలని గాంధీజీ కలలు కన్నాడో అదే నేడు అక్కడ పారుతోంది. దేశానికి మేదావులు , సైంటిస్టులు, పాలకులు. ఆచార్యులను తయారు చేయాల్సిన ఆ విశ్వవిద్యాలయంలో మద్యానికి బానిసలైన వ్యక్తులను తయారు చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది.
ఉన్నతి విద్యను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని కారణంతో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో నాటి ముఖ్యమంతి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉన్న సమయంలో నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం- నల్లగొండ మండలం అన్నెపర్తి గ్రామాల మధ్య మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పేరుతో సుమారు 14ఏండ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు 700 మంది విద్యార్థులు విద్యాభ్యాసం, వసతి పొందుతున్నారు. పట్టణాల కంటే ఎక్కువగా పల్లెల నుంచి విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు అధికంగా ఉంటున్నారు.
విశ్యవిద్యాలయం అంటే దేవాలయంతో సమానమని భావిస్తుంటారు. కానీ ఎంజీయూలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తుంది. 'అందరు శాఖహారులే... కానీ కోడి ఎలా మాయమైంది' అన్న చందంగా యూనివర్సీటీలో పరిస్థితి ఉంది. విద్యార్థులంతా దేవాలయం లాంటి యూనివర్సీటీలో అన్యాయాలు, అక్రమాలు ఎలా చేస్తారని నిత్యం ఏదో సమస్యపై ఉద్యమిస్తూ అధికారులను ప్రశ్నిస్తుంటారు. కానీ అదే దేవాలయంలో నిత్యం మద్యం సీసాలు దర్శనమిస్తుంటే దానికి బాధ్యత ఎవరూ వహిస్తారో అర్థం కావడంలేదు. ఒకవేళ అలాంటి అలవాట్లకు బానిసలుగా మారిన విద్యార్థులుంటే అది వారి వ్యక్తిగతం. కానీ నేరుగా యూనివర్సీటీలకు మద్యం బాటిళ్లను తీసుకొచ్చి బార్లుగా మారుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి చేష్టలతో తోటి విద్యార్థులకు కూడ చాలా ఇబ్బంది కలిగిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యం సేవించే వాళ్లను హాస్టళ్లలో ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ప్రశ్నించిన వారిపై వేధింపులు కూడా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వాటిని అధికారులు కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని యూనివర్సీటీ విద్యార్థులు కోరుతున్నారు.