Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
మాడ్గులపల్లి కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలకు సొంత భవనం కేటాయించి విద్యార్థులకు నోట్‌బుక్స్ అందించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ మాడ్గులపల్లి కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల ప్రస్తుతం శెట్టిపాలెంలో నడుపుతున్నారని, పాఠశాలలో దాదాపు 250 మంది విద్యార్థులు ఉన్నారని, ఈ పాఠశాల అద్దె భవనం కావడంతో అందులో కనీస సదుపాయాలు లేవన్నారు. అయినా డీఈఓ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే పాఠశాలను నల్లగొండ నియోజకవర్గ పరిధిలోకి తీసుకొచ్చి, సొంత భవనం కేటాయించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో దాదాపు నాలుగు నెలల చదువు పూర్తి కావస్తున్నా ఇప్పటివరకు ఆ పాఠశాలల్లో విద్యార్థులు రాసుకోవడానికి నోట్‌బుక్స్ అందించలేదని పేర్కొన్నారు. తక్షణమే మాడ్గులపల్లి కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను మార్చాలని, అన్ని కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందించాలని, లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డివిజన్ కార్యదర్శి సుకుమార్, యువరాజ్ పాల్గొన్నారు.