Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్
నవతెలంగాణ-దామరచర్ల
రాష్ట్రంలో నూతన జోనల్ వ్యవస్థ అమల్లో భాగంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ప్రభుత్వం విడుదల చేసిన జిఓ 317 లోపభూయిష్టంగా ఉందని, వెంటనే దానిలో స్థానికతను చేర్చుతూ సవరణలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్ డిమాండ్ చేశారు. దామరచర్లలో గురువారం జరిగిన ఆ పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిóగా పాల్గొని మాట్లాడారు. ఏదైనా కొత్త జీఓలు, మార్పులు చేసే ముందు వాటితో ప్రభావితం అయ్యే వర్గాల ప్రతినిధులతో మాట్లాడి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. జిల్లాలను విభజించిన పాలకులు అందుకు సరిపడా సిబ్బంది నియమించలేదని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఉద్యోగులనే కొత్త జిల్లాలకు సర్దుబాటు చేయడం సరికాదన్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల అభిప్రాయలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో ఉద్యోగులు స్థానికతను కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జీఓ 317ను సమీక్షించి స్థానికతకు ప్రాధాన్యత కల్పించే విధంగా సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. తమకు జరిగిన అన్యాయంపై బాధితులు ఫిర్యాదు చేసినా రాష్ట్ర స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. దీంతో వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, భార్యభర్తలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కలిగిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల కేటాయింపులో దామాషా పద్ధతి పాటించకుండా వారికి నష్టం కలిగించారని తెలిపారు. ఆయా జిల్లాల్లో ఉపాధ్యాయులకు పాఠశాలల కేటాయింపు కూడా సమస్యగా మారిందన్నారు. విద్యాశాఖలో ఇరవై వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయడం లేదని విమర్శించారు. తక్షణమే ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యావాలంటీర్లను నియమించాలని, సాధారణ బదిలీలు, పదోన్నతులు చేపట్టి పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వినోద్నాయక్, సీనియర్ నాయకులు పాపానాయక్, కోటిరెడ్డి, ఎర్రనాయక్, దయానంద్, ఖాజా మొయినుద్దీన్, గోపి, దుర్గయ్య, అంజయ్య, శ్రీను, అడవిదేవులపల్లి కన్వీనర్ బొడ్డు బాల సైదులు పాల్గొన్నారు.